కేంద్రం నుంచి మాకు కూడా ప్రేమలేఖ వచ్చింది.. ఈడీ నోటీసులపై ‘ఆప్’ వ్యంగ్యం

  • ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు పంపిన ఈడీ
  • బీజేపీ కుట్రలను బహిర్గతం చేస్తానన్న రాఘవ్ చద్దా
  • గత నెలలో శివసేన కూడా ఇలానే స్పందించిన వైనం
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులను ప్రేమ లేఖలుగా అభివర్ణిస్తున్న పార్టీల సంఖ్య పెరుగుతోంది. దర్యాప్తు సంస్థలు రాజకీయ నేతలకు పంపే నోటీసులు ప్రేమలేఖలేనని, డెత్ వారెంట్లు కావని గత నెలలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

తాజాగా, తమకు అందిన ఈడీ నోటీసులపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా కూడా అలాగే స్పందించారు. ఈడీ నోటీసులు పంపడంపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోదీ ప్రభుత్వానికి ఇష్టమైన ఈడీ నుంచి తమ ప్రభుత్వానికి ప్రేమ లేఖ వచ్చిందని అన్నారు. మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ కుట్రలను బహిర్గతం చేస్తానని పేర్కొన్నారు.

కాగా, ప్రత్యర్థులపై మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందన్న ఆరోపణలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఇవి నిజమనిపించేలా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి తాఖీదులు అందుతుండడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది. 


More Telugu News