పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా రమీజ్ రాజా

  • జట్టు హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మాథ్యూ హేడెన్
  • బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ పేసర్ ఫిలాండర్
  • టీ20 ప్రపంచకప్‌ కోసం తెచ్చామన్న నూతన అధ్యక్షుడు
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడిగా మాజీ బ్యాట్స్‌మెన్ రమీజ్ రాజా ఎన్నికయ్యాడు. పీసీబీ ఎన్నికల కమిషనర్ జస్టిస్ (రిటైర్డ్) షేక్ అజ్మత్ సయీద్ పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల్లో రమీజ్ రాజా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. ఈ క్రమంలో పీసీబీ అధ్యక్షుడి హోదాలో తొలి మీడియా సమావేశంలో రమీజ్ పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాక్ జట్టు అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చాడు. ‘‘ఒకప్పుడు క్రికెట్ ఆడే దేశాల్లో పాకిస్థాన్ జట్టంటే భయం ఉండేది. అప్పటి సంస్కృతి, మానసిక స్థితిని ప్రస్తుత జట్టులో ప్రవేశపెట్టడంపై నేను ప్రత్యేకంగా దృష్టి పెడతా’’ అని చెప్పాడు.

టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే.. పురుషుల జట్టు హెడ్ కోచ్ పదవికి మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ పదవికి వకార్ యూనిస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బయో బబుల్ వాతావరణం వల్ల ఒత్తిడి ఎదుర్కుంటున్నామని చెప్పిన ఈ మాజీలు.. తమ పదవుల నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు.

వీరి స్థానంలో హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్, బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ వెర్నాన్ ఫిలాండర్‌ను నియమించినట్లు రమీజ్ రాజా ప్రకటించాడు. వీళ్లిద్దరూ జట్టులో సానుకూల దృక్పథంతో కూడిన మార్పు తీసుకొస్తారని ఆయన అభిప్రాయపడ్డాడు.


More Telugu News