40 ఏళ్ల పాటు అడవిలో నిక్షేపంగా బతికాడు... సమాజంలోకి వచ్చి క్యాన్సర్ కు బలయ్యాడు!

  • గతంలో వియత్నాంలో యుద్ధం
  • తండ్రితో కలిసి అడవిలోకి వెళ్లిపోయిన లాంగ్
  • 2013లో మళ్లీ గ్రామానికి చేరిక
  • 2017లో తండ్రి థాన్ మృతి
  • తాజాగా లివర్ క్యాన్సర్ కు బలైన లాంగ్
వియత్నాంలో టార్జాన్ అంటూ కొంతకాలం కిందట ప్రపంచవ్యాప్తంగా మీడియాలో విశేషంగా కథనాలు వచ్చాయి. 40 ఏళ్ల పాటు అడవిలోనే బతికిన హో వాన్ లాంగ్ అనే వ్యక్తి నాగరిక సమాజంలోకి అడుగుపెట్టడంతో అందరి దృష్టి అతనిపై పడింది. కానీ విషాదం ఏంటంటే... ప్రజల్లోకి వచ్చిన తర్వాత వాన్ లాంగ్ కేవలం కొన్నేళ్లపాటే బతికాడు. 52 ఏళ్ల వయసులో లివర్ క్యాన్సర్ తో తుదిశ్వాస విడిచాడు.

వియత్నాం యుద్ధం సమయంలో లాంగ్ చాలా చిన్నవాడు. అతడికి రెండేళ్ల వయసు ఉంటుంది. అయినవాళ్లందరూ యుద్ధంలో చనిపోగా, లాంగ్, తండ్రి, సోదరుడు మిగిలారు. లాంగ్ ను తీసుకుని తండ్రి అడవుల్లోకి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడు. చెట్లపైనా, గుహల్లోనూ నివసిస్తూ అక్కడ దొరికే వాటిని తింటూ నాలుగు దశాబ్దాలు గడిపారు. లాంగ్ కు ఊహ తెలియకముందే అడవిలోకి వెళ్లిపోవడంతో కనీసం స్త్రీ సాంగత్యం గురించి కూడా తెలియకుండా పెరిగాడు. 2013లో అధికారులు ఎంతో శ్రమించి వీరి జాడను కనుగొని ప్రజల్లోకి తీసుకువచ్చారు.

2017లో లాంగ్ తండ్రి థాన్ మరణించగా, 2016లో లాంగ్ తన అడవి నివాసానికి మళ్లీ వెళ్లిపోయాడు. తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత ఇటీవల లాంగ్ ఆరోగ్యం బాగా క్షీణించింది. వైద్య పరీక్షల్లో అతడు లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. గ్రామస్తులందరినీ విషాదంలో ముంచెత్తుతూ గత సోమవారం కన్నుమూశాడు.

అడవిలో సహజసిద్ధ ఆహారం తిని ఆరోగ్యంగా ఉన్న లాంగ్, బయటి ప్రపంచంలోని శుద్ధి చేసిన ఆహారాన్ని తినడం, మద్యం తాగడం వంటి కారణాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని లాంగ్ స్నేహితుడు సెరెజో తెలిపారు.


More Telugu News