ఇక ఆఫీసుకొచ్చేయండి: ఉద్యోగులకు విప్రో చైర్మన్ పిలుపు

  • దేశంలో తగ్గుతున్న కరోనా ఉద్ధృతి
  • వారానికి రెండు రోజులు ఆఫీసు నుంచే పని
  • ఉద్యోగులు సురక్షితంగా వచ్చి వెళ్లేందుకు ఏర్పాట్లు
  • వ్యాక్సినేషన్ పూర్తయిన వారు మాత్రమే
దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండడం, ప్రజల్లో భయాందోళనలు తగ్గడంతో ఆయా సంస్థలన్నీ వర్క్ ఫ్రమ్ హోంకు స్వస్తి పలకాలని నిర్ణయించాయి. ఇక ఆఫీసుకు దయచేయండంటూ ఉద్యోగులకు వర్తమానాలు పంపుతున్నాయి.

ఈ క్రమంలో తాజాగా, విప్రో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. నేటి (సోమవారం) నుంచి కార్యాలయాలకు రావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న వారిని మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతానికైతే వారానికి రెండు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ నిన్న ట్వీట్ చేశారు.

18 నెలల సుదీర్ఘకాలం తర్వాత తమ ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు రాబోతున్నారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ పూర్తయిన వారు నేటి నుంచి వారానికి రెండు రోజులు ఆఫీసు నుంచే పనిచేస్తారని తెలిపారు. వారు ఆఫీసుకి సురక్షితంగా వచ్చి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా షేర్ చేశారు.


More Telugu News