యూపీ ప్రభుత్వం ప్రకటనలో కోల్‌కతా బ్రిడ్జి.. టీఎంసీ-బీజేపీ మాటల యుద్ధం

  • ప్రకటనను ప్రచురించిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక 
  • తప్పును గుర్తించి డిజిటల్ మాధ్యమాల నుంచి తొలగింపు 
  • ఫ్లై ఓవర్‌ను, భవనాన్ని తస్కరించి పసుపు రంగు కారును అలాగే వదిలేశారని టీఎంసీ ఎద్దేవా
  • బెంగాల్ అభివృద్ధిని యోగి తనదిగా చెప్పుకుంటున్నారని ఫైర్
  • దీటుగా బదులిచ్చిన బీజేపీ
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పేపర్ ప్రకటనలో కోల్‌కతాలోని ఫ్లై ఓవర్ కనిపించడం టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. యోగి అధికారం చేపట్టిన ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయంటూ యూపీ ప్రభుత్వం పెద్ద ప్రకటన ఇచ్చింది. అయితే ఆ ప్రకటనలో కనిపించిన ఫ్లై ఓవర్ కోల్‌కతాలోనిదని ఆ ప్రకటనను ప్రచురించిన ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ గుర్తించింది. ఆ వెంటనే డిజిటల్ మాధ్యమాల్లో దానిని తొలగిస్తున్నట్టు వివరణ ఇచ్చింది.

ఇది టీఎంసీ-బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఫ్లై ఓవర్‌ను, భవనాన్ని తస్కరించారని, కానీ దానిపై ఉన్న పసుపు రంగు కారును అలాగే వదిలేశారని టీఎంసీ ఎద్దేవా చేసింది. బెంగాల్ అభివృద్ధిని యోగి తనదిగా చెప్పుకుంటున్నారని మండిపడింది. డబుల్ ఇంజిన్ మోడల్ అంటే ఇదే కాబోలు అంటూ టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ట్వీట్ చేశారు.

 పార్టీని రక్షించుకోవడం కోసం సీఎంలను మార్చడం తప్ప బీజేపీకి ఇంకేమీ తెలియదని టీఎంసీ సీనియర్ నేత ముకుల్ రాయ్ ధ్వజమెత్తారు. స్పందించిన బీజేపీ కూడా దీటుగానే బదులిచ్చింది. యోగి హయాంలో ఎన్నో ఫ్లై ఓవర్ల నిర్మాణం జరిగిందని, కానీ ఏదీ బెంగాల్‌లోలా కూలిపోలేదని ఎద్దేవా చేసింది. ప్రకటనలో తప్పు ఉన్నంత మాత్రాన ఆదిత్యనాథ్ చేసిన అభివృద్ధి చెరిగిపోదని బీజేపీ నేత సయంతన్ బసు పేర్కొన్నారు.


More Telugu News