దిగొస్తున్న కరోనా కేసులు.. కేరళలో కొనసాగుతున్న ఉద్ధృతి

  • గత 24 గంటల్లో 28,591 కేసుల నమోదు
  • 338 మంది మృతి
  • మొత్తం కేసులు, మరణాల్లో అత్యధిక శాతం కేరళ నుంచే
దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా దిగివస్తున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 28,591 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కు చేరింది. 338 మంది కరోనాకు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. వీటితో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,42,655కు పెరిగింది. ఇక, గత 24 గంటల్లో కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ కావడం గమనార్హం. మొత్తం 34,848 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 3,84,921 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,24,09,345కు చేరుకుంది.

నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 73,82,07,378 మందికి టీకాలు వేయగా, నిన్న ఒక్క రోజే 72,86,883 మందికి టీకాలు వేశారు. మరోవైపు, కేరళలో మాత్రం పరిస్థితి ఇంకా ఆందోళనగానే ఉంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికశాతం ఆ రాష్ట్రం నుంచే వెలుగు చూస్తున్నాయి. కేరళలో నిన్న 20,487 కేసులు నమోదు కాగా, 181 మంది ప్రాణాలు కోల్పోయారు.


More Telugu News