జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా

  • హర్యానాలో జరిగిన పరీక్షల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తింపు
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కనపెట్టిన అనంతరం ఫలితాలు
  • రేపు, లేదంటే ఎల్లుండి మెయిన్ ఫలితాల వెల్లడి
జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో ఆలస్యం కారణంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడింది. నిజానికి ఈ ఉదయం పది గంటలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ నెల 13న మధ్యాహ్నం మొదలై 19న సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుందని ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రకటించింది. ఫీజు చెల్లింపునకు మాత్రం ఈ నెల 20వ తేదీ సాయంత్రం వరకు గడువు ఉంటుందని పేర్కొంది. వచ్చే నెల 3న జరగాల్సిన పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని, అందులో ఎలాంటి మార్పు లేదని తెలిపింది.

హర్యానాలో జరిగిన పరీక్షల్లో అవకతవకలు జరిగినట్టు సీబీఐ తేల్చడంతో నిన్న సాయంత్రం విడుదల కావాల్సిన జేఈఈ మెయిన్ ఫలితాలను వాయిదా వేశారు. రేపు, లేదంటే ఎల్లుండి వీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థుల ఫలితాలను పక్కనపెట్టిన అనంతరం ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించడం వల్లే జాప్యం అవుతున్నట్టు తెలుస్తోంది.


More Telugu News