దేశంతో తగ్గుతున్న కరోనా ఉద్ధృతి.. 3.32 కోట్లు దాటిన కేసులు

  • రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ
  • నిన్న దేశవ్యాప్తంగా 308 మంది మృత్యువాత
  • ఒక్క కేరళలోనే 177 మంది మృతి
దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 33,376 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,32,08,330 కోట్లకు చేరుకుంది. అలాగే, 32,198 మంది వైరస్ బారినుంచి కోలుకుని బయటపడగా 308 మంది మరణించారు.

అయితే, కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య తక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3.23 కోట్ల మంది కరోనాను జయించారు. దీంతో రికవరీ రేటు 97.49 శాతానికి పెరిగింది. దేశంలో ఇంకా 3,91,516 కేసులు (1.18శాతం) యాక్టివ్‌గా ఉన్నాయి.

మరోవైపు, కరోనా విజృంభణ కొనసాగుతున్న కేరళలో మరోమారు భారీ స్థాయిలో కేసులు వెలుగు చూశాయి. నిన్న 25,010 కేసులు బయటపడగా 177 మంది మరణించారు. అలాగే, ఇప్పటివరకు దేశంలో 4,42,317 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 65,27,175 మందికి కరోనా టీకాలు వేశారు. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు దేశంలో 73,05,89,688 మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.


More Telugu News