క‌ళ్లజోడుతో వీడియోలు, ఫొటోలు తీయొచ్చు.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో ఆవిష్కరించిన ఫేస్‌బుక్‌!

  • ప‌లు దేశాల్లో విడుద‌ల చేసిన ఫేస్‌బుక్‌
  • ఫొటోలు, వీడియోలు మ‌న మొబైల్‌లోనూ సేవ్ చేసుకోవ‌చ్చు
  • రే బాన్‌ స్టోరీస్ పేరిట‌ 20 ర‌కాల‌ స్మార్ట్‌ కళ్లజోడుల విడుదల‌
క‌ళ్ల‌జోడును ఎందుకు వాడ‌తామ‌ని అడిగితే ఇప్ప‌టివ‌ర‌కు సైటు కోసం, సూర్య ర‌శ్మి నుంచి క‌ళ్ల‌కు ఉప‌శ‌మ‌నం కోసం వాడతాం అని చెబుతుంటాం. ఇక‌పై అంత‌కు మించిన సౌక‌ర్యాల కోసం వాడ‌తామ‌ని చెప్పుకునే రోజులు వ‌చ్చేశాయి. ప్ర‌ముఖ సామాజిక మాధ్య‌మ సంస్థ ఫేస్‌బుక్ రే బాన్‌ స్టోరీస్ 20 ర‌కాల‌ స్మార్ట్‌ కళ్లజోడును విడుద‌ల చేసింది. అందులో కొత్తేముంద‌ని అనుకుంటున్నారా? ఇందులో 5ఎంపీ కెమెరాతో ఫొటోలు తీసుకునే ఫీచ‌ర్ ఉంది.

అంతేకాదు, 30 సెకన్ల వీడియోల్ని రికార్డు చేయొచ్చు. అది కూడా క్యాప‍్చరింగ్‌ బటన్‌తో పాటు ఫేస్‌బుక్‌ అసిస్టెంట్‌ వాయిస్‌ కమాండ్స్‌ ద్వారా టచ్‌ చేయకుండానే ఫొటోలు, వీడియోలు తీసుకోవ‌చ్చు.  ప్ర‌జ‌ల‌ వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం క‌లిగించే అవ‌కాశం మాత్రం ఉండ‌దు.

ఇన్‌బిల్ట్‌గా వచ్చే ఎల్‌ఈడీ లైట్‌ సెటప్‌ క్యాప్చర్‌ కొట్టగానే ఫ్లాష్‌ ఇస్తుంది. దీంతో ఫొటోలు తీసే స‌మ‌యంలో మ‌న ప‌క్క‌న ఉండేవారికి ఈ విష‌యం తెలిసి పోతుంది. అలాగే, ఇందులో వాయిస్‌ కమాండ్‌ను, ఆడియోను రికార్డు చేసేలా మూడు చిన్న మైక్రోఫోన్‌లు కూడా ఉంటాయి.

దీని ద్వారా మ‌న‌ ఫోన్‌లోని వీడియోలను కూడా ఈ క‌ళ్ల‌జోడులో చూసుకోవ‌చ్చు. క‌ళ్ల‌జోడు ద్వారా తీసే వీడియోలను మ‌న‌ స్మార్ట్‌ ఫోన్‌లోనూ సేవ్‌ చేసుకోవచ్చు. అయితే, ఈ క‌ళ్ల‌జోడులో కృత్రిమ మేధ సాంకేతిక‌త‌ను వాడ‌లేదు. భ‌విష్య‌త్తులో ఈ క‌ళ్లజోళ్ల‌ను మ‌రింత అభివృద్ధి చేసి మ‌రిన్ని ఫీచ‌ర్ల‌తో ముందుకు తెచ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఈ క‌ళ్లజోళ్లు అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్‌, ఇటలీ, యూకేలో అందుబాటులోకి వ‌చ్చాయి. ఆన్‌లైన్‌లో, ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్‌లలో వీటిని విక్ర‌యానికి ఉంచారు.


More Telugu News