కోట్లు ఖర్చు చేసి కొవిడ్ కోచ్‌లుగా మార్చితే ఒక్కరూ ఎక్కని వైనం!

  • కోట్లాది రూపాయలు నీళ్లపాలు
  • ఒక్కరంటే ఒక్క ప్రయాణికుడు కూడా వినియోగించుకోని వైనం
  • తిరిగి సాధారణ కోచ్‌లుగా మార్పు
కరోనా మహమ్మారి నేపథ్యంలో గతంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఐసోలేషన్‌గా మార్చిన కరోనా కోచ్‌లు నిరుపయోగంగా మారాయి. ఫలితంగా వాటన్నింటినీ మళ్లీ సాధారణ కోచ్‌లుగా మార్చే పనిలో పడింది రైల్వేశాఖ. గతంలో 486 నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లను రైల్వే శాఖ కరోనా రోగులకు అనువుగా ఐసోలేషన్ కోచ్‌లుగా మార్చింది.

దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 120, తిరుపతిలో 84, లాలాగూడ వర్క్‌షాప్‌లో 76, గుంతకల్లులో 61, విజయవాడలో 50, హైదరాబాద్‌లో 40, నాందేడ్‌లో 30, గుంటూరులో 25 స్లీపర్ క్లాస్ బోగీలను ఐసోలేషన్ బోగీలుగా మార్చింది. బెర్తుల మధ్య ఖాళీలు వదలడంతోపాటు బెర్తుల వెడల్పు పెంచడం, టాయిలెట్, స్నానాల గది ఏర్పాటు చేయడం వంటి వాటిని ఏర్పాటు చేశారు.

అయితే, వీటిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఎక్కకపోవడంతో అవన్నీ ఖాళీగా ఉండిపోయాయి. దీంతో వీటికి మళ్లీ మార్పులు చేసి, సాధారణ ప్రయాణికులకు అనువుగా మార్చాలని నిర్ణయించుకున్న రైల్వే.. వాటిని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు జత చేస్తోంది. కొవిడ్ కోచ్‌లుగా మార్చిన అన్నింటినీ దాదాపు స్లీపర్ బోగీలుగా మార్చినట్టు తెలిపింది. అయితే, వీటిలో వంద బోగీలను మాత్రం పార్శిల్ సేవలకు వినియోగించాలని నిర్ణయించినట్టు సమాచారం.


More Telugu News