ఈటల, బండి ఎంత గుంజినా మోదీ-కేసీఆర్ ఫెవికాల్ బంధం తెగేది కాదు: రేవంత్‌రెడ్డి

  • కాంగ్రెస్ ఎన్నో కష్టనష్టాలు అనుభవించి తెలంగాణ ఇచ్చింది
  • ఈ ఏడేళ్లలో ప్రజల భవిష్యత్ అంధకారంగా మారింది
  • 17నాటి గజ్వేల్ సభకు మల్లికార్జున ఖర్గే
  • కేసీఆర్‌‌కు మోదీ ఆస్తులు రాసిస్తున్నది అందుకే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ది, ప్రధానమంత్రి మోదీది ఫెవికాల్ బంధమని, ఈటల రాజేందర్, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎంత లాగినా అది తెగేది కాదని ఎద్దేవా చేశారు. పీసీసీ కమిటీ ఏర్పాటుపై కాంగ్రెస్ అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలిపేందుకు నిన్న ఢిల్లీ చేరుకున్న రేవంత్‌రెడ్డి.. రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నో కష్టనష్టాలు భరించి తెలంగాణను ఇచ్చిందని, కానీ ఈ ఏడేళ్లలో తెలంగాణ ప్రజల భవిష్యత్ అంధకారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాహుల్‌తో చాలా విషయాలు చర్చించామని, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, దళితులు, గిరిజనుల సమస్యలపై చర్చించినట్టు చెప్పారు. వారి పక్షాన నిలబడి ప్రభుత్వంతో కొట్టాడామన్నారు. అలాగే, భూముల అమ్మకాలు, అవినీతి, ప్రాజెక్టుల్లో కుంభకోణాలు వంటి వాటిపైనా చర్చించినట్టు తెలిపారు.

మూడు నెలలకోసారి రాష్ట్రంలో పర్యటించాలన్న తమ అభ్యర్థనకు రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారని రేవంత్‌రెడ్డి తెలిపారు. డిసెంబరు 9 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, ఒకే రోజు పది లక్షల మందిని చేర్చుకోవడమే లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమానికి రాహుల్‌ను ఆహ్వానించినట్టు చెప్పారు. కాగా, ఈ నెల 17న గజ్వేల్‌లో నిర్వహించే కార్యక్రమంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొంటారని రేవంత్ తెలిపారు.

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయడమే తెలంగాణ ఆత్మగౌరవంగా చెప్పుకుంటున్న కేసీఆర్, కేటీఆర్.. ఏడేళ్లయినా హైదరాబాద్‌లో అమరవీరుల స్తూపాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రానికి పెను సమస్యగా మారిందని ధ్వజమెత్తారు. మోదీకి కనుక తెలంగాణ ప్రజల త్యాగాల మీద గౌరవం ఉంటే ఢిల్లీలో అమరవీరుల స్తూపం కోసం ఎకరా స్థలం ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు.

రాజకీయంగా కేసీఆర్ అండగా నిలబడుతున్నందుకే మోదీ ఆస్తులు రాసిస్తున్నారని దుయ్యబట్టారు. యూపీలో ప్రతిపక్ష ఓట్లను చీల్చేందుకు ఎంఐఎంను ఎన్నిచోట్ల నుంచి పోటీ చేయించాలనే దానిపై మోదీ, అమిత్‌షాలతో కేసీఆర్ చర్చించారని రేవంత్ ఆరోపించారు. ఇప్పటికైనా మోదీ, కేసీఆర్ మధ్య ఉన్న బంధాన్ని ఈటల, బండి సంజయ్ అర్థం చేసుకుని తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాలని రేవంత్ డిమాండ్ చేశారు.


More Telugu News