వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

  • ప్రైవేట్ స్థలాల్లో ఉత్సవాలను నిర్వహించుకోవచ్చు
  • ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవచ్చు
  • మత కార్యక్రమాలను నిరోధించే హక్కు ఎవరికీ లేదు
వినాయక చవితి ఉత్సవాల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రభుత్వం షరతు విధించడంపై విపక్షాలతో పాటు హిందూ సంఘాలు కూడా మండిపడ్డాయి. పలు ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ప్రైవేటు స్థలాలలో విగ్రహాలను ఏర్పాటు చేసుకుని, వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. గణేశ్ ఉత్సవాలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారించిన కోర్టు ప్రైవేట్ స్థలాల్లో వినాయక ఉత్సవాలను నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది.

భక్తులు కోవిడ్ నిబంధనలను పాటించాలని, ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని చెప్పంది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు ఎవరికీ లేదని తెలిపింది. అయితే, పబ్లిక్ స్థలాలలో మాత్రం ఉత్సవాలు నిర్వహించకూడదని పేర్కొన్న హైకోర్టు.. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.


More Telugu News