శశికళకు పెద్ద షాక్.. రూ. 100 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఐటీ శాఖ!

  • తమిళనాడులో 24 ఎకరాల విస్తీర్ణంలో ఆస్తులు
  • 2014లో అక్రమాస్తులుగా తీర్పును వెలువరించిన కర్ణాటక స్పెషల్ కోర్టు
  • సీజ్ చేసినట్టు నోటీసులు అతికించిన ఐటీ శాఖ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు ఊహించని షాక్ ఎదురైంది. ఆమెకు చెందిన 11 ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. తమిళనాడులోని పయనూర్ గ్రామంలోని 24 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆస్తులు ఉన్నాయి. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న 1991-1996 మధ్యకాలంలో ఈ ఆస్తులను శశికళ కొనుగోలు చేశారు. ఈ ఆస్తులను కొనుగోలు చేసే సమయంలో వాటి విలువ రూ. 20 లక్షల వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు వాటి విలువ దాదాపు రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

2014లో  కర్ణాటక స్పెషల్ కోర్టు జడ్జి జాన్ మిఖాయెల్ కున్హా ఈ ఆస్తులను అక్రమాస్తులుగా నిర్ధారిస్తూ తీర్పును వెలువరించారు. ఆ అక్రమాస్తులు జయలలిత, శశికళకు చెందినవని తెలిపారు. ఆనాటి కోర్టు తీర్పును అనుసరించి బినామీ నిరోధక చట్టం కింద ఐటీశాఖ ఈరోజు ఆ ఆస్తులను సీజ్ చేసింది. ఆస్తులు ఉన్న ప్రాంతంలో వాటిని సీజ్ చేసినట్టు నోటీసులు అతికించారు.

అయితే, ఇక్కడ గమనించదగ్గ అంశం ఏమిటంటే, ఈ ఆస్తులను శశికళ ఉపయోగించుకోవచ్చు, కానీ ఆస్తులపై ఎలాంటి లావాదేవీలు జరపడానికి మాత్రం వీలుండదు. నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత శశికళ ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన సంగతి తెలిసిందే. శశికళ వయసు 67 సంవత్సరాలు.


More Telugu News