ప్రకాశం జిల్లా పోలీసులు టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం

  • ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ 
  • టీడీపీ కార్యకర్తలను స్టేషన్ కు పిలిచారన్న బాబు
  • పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపణ
  • తమ కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారన్న చంద్రబాబు   
ప్రకాశం జిల్లా లింగసముద్రం పోలీసులు తమ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగిలిచర్ల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి, కొందరిని చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో 10 ఏళ్ల లోపు చిన్నారులు కూడా ఉన్నారంటూ ఆయన మండిపడ్డారు.

వైసీపీ నేతల ఆదేశాల మేరకే పోలీసులు టీడీపీ కార్యకర్తలను స్టేషన్ కు పిలిపించారని, టీడీపీని వీడాలంటూ వారిపై ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. పోలీసుల చిత్రహింసలకు భయపడి రత్తయ్య, శ్రీకాంత్ అనే టీడీపీ కార్యకర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ ఘటన జరగడంతో మిగిలిన వారిని పోలీసులు స్టేషన్ నుంచి పంపించివేశారని చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు రాసిన తాజా లేఖలో పేర్కొన్నారు.

లింగసముద్రం ఘటనపై తక్షణమే విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యవహారాలతో రాష్ట్ర పోలీస్ విభాగం ప్రతిష్ఠ నానాటికీ దిగజారుతోందని స్పష్టం చేశారు.


More Telugu News