భూమికి చేరువగా దూసుకొస్తున్న గ్రహశకలం.. మనకు ప్రమాదం ఏమీ లేదన్న నాసా!

  • గంటకు 33,660 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న గ్రహశకలం  
  • 2021 ఎన్‌వై1ను జూన్ నుంచి పరిశీలిస్తున్న నాసా
  • బస్సు సైజులో ఉంటుందని అంచనా
అంతరిక్షంలో పెద్ద బస్సు సైజులో ఉండే ఒక గ్రహశకలం భూమికి చేరువగా దూసుకొస్తోంది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. నాసా జెట్ ప్రొపల్షన్ పరిశోధనా కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, 2021 ఎన్‌వై1 అని పిలిచే ఈ గ్రహశకలం.. భూమి నుంచి 14,98,113 కిలోమీటర్ల దూరంలో దూసుకెళ్లనుందని అంచనా.

ఇది గంటకు 33,660 కిలోమీటర్ల వేగంతో భూమివైపు దూసుకొస్తోందని నాసా తెలిపింది. దీన్ని అపోలో క్లాస్ ఆస్టరాయిడ్‌గా నాసా వర్గీకరించింది. దీని పరిమాణం 0.127 కిలోమీటర్ల నుంచి 0.284 కిలోమీటర్ల వరకూ ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది ప్రయాణించే మార్గాన్ని సైంటిస్టులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

ఈ గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 1400 రోజులు పడుతుందట. ఇది మరో శతాబ్దం తర్వాత భూమికి అత్యంత సమీపంలోకి వస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ 12 నుంచి దీన్ని నాసా పరిశీలనలో ఉంచారు. దీన్నుంచి భూమికి ప్రమాదం లేకపోయినా కూడా అత్యంత ప్రమాదకర గ్రహశకలాల కేటగిరీలో 2021 ఎన్‌వై1ను నాసా చేర్చింది.


More Telugu News