ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కెనడా ప్రధానిపై రాళ్ల దాడి

  • కెనడాలో ఈ నెల 20న ఎన్నికలు
  • ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న జస్టిన్ ట్రూడో
  • ప్రచార బస్సుపై గులకరాళ్ల వర్షం
  • పాత్రికేయులకు తగిలిన రాళ్లు
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనపై ప్రజలు రాళ్ల వర్షం కురిపించారు. సెప్టెంబరు 20న కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రాంట్ ఫోర్డ్, ఒంటారియో ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు.

ఒంటారియోలోని లండన్ టౌన్ లో ప్రచారం చేస్తుండగా, ఆగ్రహించిన ప్రజలు ఆయన ప్రయాణిస్తున్న ప్రచార బస్సుపై గులక రాళ్లతో దాడి చేశారు. సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ప్రధాని ప్రచారానికి కవరేజీ ఇస్తున్న పాత్రికేయులకు మాత్రం రాళ్లు తగిలాయి. అయితే ఈ ఘటనను ప్రధాని జస్టిన్ ట్రూడో తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడు రాళ్లు వేశారు... గతంలో ఓసారి నాపై గుమ్మడికాయ విత్తనాలు కూడా విసిరారు అంటూ పాత్రికేయులకు వివరించారు.

ఇంతకీ ప్రజలు ప్రధానిపై ఆగ్రహం చెందడానికి కారణం కరోనా నిబంధనలే. వ్యాక్సినేషన్ ను తప్పనిసరి చేయడంతో పాటు, కరోనా నియమావళిని కచ్చితంగా పాటించాల్సిందేనని ట్రూడో సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దేశీయంగా విమానాల్లో, రైళ్లలో ప్రయాణాలకు కూడా వ్యాక్సినేషన్ నిబంధన అమలు చేస్తుండడం కెనడా ప్రజలను తీవ్ర  అసహనానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రధాని ప్రచారానికి ప్రజలు పలుచోట్ల ఆటంకాలు సృష్టిస్తున్నారు.


More Telugu News