తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలి: రేవంత్ రెడ్డి

  • తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రేవంత్ స్పందన
  • ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని విమర్శలు 
  • ఆర్థిక పరిస్థితి దిగజార్చారని మండిపాటు
  • ఉద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని వ్యాఖ్య  
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సంక్షోభంలో చిక్కుకుందా? అని ప్రశ్నించారు. నాడు రూ.16 వేల కోట్ల మిగులుతో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ కేసీఆర్ చేతుల్లో పెట్టిందని వెల్లడించారు. కానీ నేడు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి దిగజార్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. జీతాల కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న వేతన జీవులే దీనికి సాక్ష్యమని తెలిపారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాగా, టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పొట్టిగా గింత ఉంటడు... గట్టిగా పిసికితే గిలగిల కొట్టుకుంటడు. మా పర్సనాలిటీలు ఎక్కడ... మీ పర్సనాలిటీలు ఎక్కడ? మాట్లాడేముందు కనీసం ఎదుటివాడి పర్సనాలిటీ చూసైనా ఆలోచించాలి కదా?" అంటూ ఎద్దేవా చేశారు.

విపక్ష నేతల మాటలు భరింపరానివిగా ఉంటున్నాయని, అయితే కేటీఆర్ వల్లే తాము సంయమనం పాటిస్తున్నామని తలసాని స్పష్టం చేశారు. కేటీఆర్ ఈ అంశంలో ఓ నిర్ణయం తీసుకోవాలని, ఇక విపక్ష నేతలను ఉపేక్షించేది లేదని అన్నారు. తాము కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు.


More Telugu News