కరోనా ఎఫెక్ట్.. కోహ్లీ, రవిశాస్త్రిల తీరుపై బీసీసీఐ ఆగ్రహం!

  • లండన్ లో బుక్ లాంచింగ్ కార్యక్రమానికి వెళ్లిన వైనం
  • శాస్త్రితో పాటు భరత్, శ్రీధర్ లకు కరోనా పాజిటివ్
  • అనుమతి లేకుండానే ఈవెంట్ కు వెళ్లడంపై బోర్డు ఆగ్రహం
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రిలపై బీసీసీఐ ఆగ్రహంగా ఉంది. ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ సందర్భంగా రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. వీరు ముగ్గురికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

గత వారం వీరందరూ కలిసి లండన్ లో జరిగిన ఒక బుక్ లాంచింగ్ కార్యక్రమానికి వెళ్లొచ్చారు. కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు కూడా ఈ ఈవెంట్ కు వెళ్లారు. అయితే ఈ ముగ్గురూ కరోనా బారిన పడినప్పటికీ... ఆటగాళ్లకు మాత్రం వైరస్ సోకలేదు. మరోవైపు, ఈ కార్యక్రమానికి వెళ్లడానికి వీరు బీసీసీఐ అనుమతి కూడా తీసుకోలేదు. ఈ అంశాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తోంది.

అనుమతి లేకుండానే ఈవెంట్ కు వెళ్లడంపై వివరణ ఇవ్వాలంటూ కోహ్లీ, రవిశాస్త్రిలను బీసీసీఐ కోరింది. ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పటికే బీసీసీఐకి అందాయి. దీనిపై బోర్డు విచారణ ప్రారంభించింది.


More Telugu News