నేడు అయోధ్య జిల్లాకు అస‌దుద్దీన్ ఒవైసీ.. అక్క‌డి నుంచే ఎన్నిక‌ల ప్ర‌చారం షురూ

  • స‌భ‌లో ప్ర‌సంగించ‌నున్న ఒవైసీ
  • అయోధ్య నగరానికి 57 కిలోమీటర్ల దూరంలోనే స‌భ‌
  • 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఆ రాష్ట్రంలో పోటీ చేసే అన్ని పార్టీలు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నాయి. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ రోజు  అయోధ్య జిల్లా నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తార‌ని, ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌సంగిస్తార‌ని ఎంఐఎం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ అధ్యక్షుడు షౌకత్ అలీ ప్ర‌క‌టించారు.

అయోధ్య నగరానికి 57 కిలోమీటర్ల దూరంలోని రుదౌలి తహసీల్ లో ఈ ఎన్నికల ప్రచార ప్రారంభోత్స సభ జ‌ర‌గ‌నుంది. ఈ సమావేశానికి ముస్లింలనే కాకుండా  దళితులు, వెనుకబడిన, అగ్రవర్ణ హిందువులను కూడా ఆహ్వానించినట్లు అలీ చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే అన్ని వర్గాల సంక్షేమం కోసం తాము ప‌నిచేస్తామ‌ని అన్నారు. ఈ సారి యూపీలో 100 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామని తెలిపారు.

కాగా, ఈ సంద‌ర్భంగా ఎంఐఎం అయోధ్య జిల్లాను ఫైజాబాద్ అని సోషల్ మీడియాలో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఎంఐఎం తీరుపై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఎంఐఎం ర్యాలీని నిషేధించాలని కోరుతున్నారు. ఫైజాబాద్ జిల్లా పేరును 2018 నవంబర్‌లో అయోధ్యగా మార్చిన విష‌యం తెలిసిందే. కాగా, ఒవైసీ అయోధ్యను సందర్శించడానికి అనుమతించబోమని హనుమాన్ గార్హి ఆలయ పూజారి మహంత్ రాజు దాస్ అన్నారు.


More Telugu News