ఆఫ్ఘనిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశాన్నీ వేలుపెట్టనివ్వం: తాలిబన్

  • పాక్ సహా ఏ దేశానికి అవకాశం ఇవ్వబోమన్న తాలిబన్లు
  • తాలిబన్ల నేత బరాదర్‌ను ఇటీవల కలిసిన ఐఎస్ఐ చీఫ్ హమీద్
  • ధ్రువీకరించిన తాలిబన్ల ప్రతినిధి జబియుల్లా ముజాహిద్
తమ దేశపు అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశాన్నీ వేలు పెట్టనివ్వబోమని తాలిబన్లు ప్రకటించారు. పాకిస్థాన్‌కు కూడా ఈ అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఇటీవల పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ కాబూల్ వెళ్లారు. ఆ సమయంలో తమ ప్రభుత్వాధినేతగా తాలిబన్లు ఎన్నుకున్న ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌ను హమీద్ కలిశారు.

ఈ విషయాన్ని తాలిబన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ ధ్రువీకరించారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్థాన్‌లో ఎటువంటి చర్యలూ జరగబోవని పాక్‌కు హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఐఎస్ఐ చీఫ్ కాబూల్ వెళ్లడంతో చాలా దేశాలు ఈ రహస్య సమావేశంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ముఖ్యంగా భారత్‌కు వ్యతిరేకంగా తాలిబన్లతో పాక్ ఒప్పందం చేసుకునే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు.

అయితే అలాంటి ఒప్పందాలేవీ లేవని తాలిబన్లు స్పష్టం చేశారు. ఇరుదేశాల ద్వైపాక్షిక ఒప్పందాల గురించి మాత్రమే పాకిస్థాన్ నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ అంతర్గత విషయాల్లో పాకిస్థానే కాదు, ఏ దేశాన్నీ జోక్యం చేసుకోనివ్వబోమని తాలిబన్లు తేల్చిచెప్పారు.


More Telugu News