హరీశ్ రావు అరాచకాలకు పాల్పడుతున్నారు.. భరతం పడతాం: ఈటల వార్నింగ్

  • టీఆర్ఎస్ లో చేరాలని బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారు
  • పోలీసులను రాత్రి పూట ఇళ్లకు పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారు
  • 2023 వరకే టీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది
మంత్రి హరీశ్ రావు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ లో చేరాలని బెదిరిస్తున్నారని... రాత్రి పూట ఇళ్లకు పోలీసులను పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులు ఆపకపోతే భరతం పడతామని హెచ్చరించారు.

ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే... హుజూరాబాద్ లో హరీశ్ రావు ఆచరిస్తున్నారని ఈటల అన్నారు. తన వెంట ఉండేవారిని టీఆర్ఎస్ లో చేరాలని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో టీఆర్ఎస్ లో చేరినవారు ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నరని చెప్పారు. వారు ఎదుర్కొంటున్న అవమానాలను చూసి టీఆర్ఎస్ లో చేరడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలిపారు. ఈ కారణం వల్లే ఇప్పుడు పోలీసుల చేత బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కత్తి ఏపీ పాలకుల చేతిలో ఉండేదని, ఆ కత్తితో వాళ్లు తెలంగాణ వాళ్లను పొడిచేవారంటూ కేసీఆర్ చెప్పేవాడని... ఇప్పుడు కత్తి కేసీఆర్, హరీశ్ రావుల చేతిలో ఉందని, వీరిద్దరు కూడా ఆ కత్తితో మనోళ్లనే పొడుస్తున్నారని ఈటల దుయ్యబట్టారు. అధికారం ఉంది కదా అని కేసీఆర్, హరీశ్ లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని అన్నారు. 2023 వరకే టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని.. ఆ తర్వాత వీరికి సహకరిస్తున్న అధికారుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.


More Telugu News