ఆధార్‌లో ఇక‌పై బంధుత్వాన్ని తెలిపే ప‌దాలు ఉండ‌వు!

  • తండ్రి/భ‌ర్త అనే ప‌దాల‌ను తొల‌గించిన అధికారులు
  • ఆ స్థానంలో కేరాఫ్ అనే ప‌దం
  • బంధుత్వాన్ని తెలిపే అవ‌స‌రం లేదు
  • సంర‌క్ష‌కుడి పేరు రాస్తే స‌రిపోతుంది
  • ఆధార్ అప్‌డేట్స్ చేయించుకుంటే మార్పులు
ప్రస్తుతం ఆధార్ కార్డు అవసరం, ప్రాధాన్యత ఎంతగా ఉన్నాయనేది ప్ర‌త్యేకంగా చెప్పే అవ‌స‌రం లేదు. అన్ని ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కూ ఆధార్ తప్పనిసరి. అయితే, ఆధార్‌లో త‌ప్పులు ఉంటే పౌరులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని స‌రిచేసుకునేందుకు ఆధార్ కేంద్రాల‌కు వెళ్తుంటారు.

తాజాగా ఆధార్ కార్డు కేంద్రానికి వెళ్లిన కొంద‌రు పౌరులు ఓ కీల‌క విష‌యాన్ని గుర్తించారు. ఆధార్ కార్డును అప్‌డేట్ చేస్తే ఇక‌పై అందులో తండ్రి పేరు/భర్త పేరు అని ఉండదు. సంర‌క్ష‌కుడికి, కార్డుదారుడికి మ‌ధ్య ఉన్న‌ బంధుత్వాన్ని తెలిపే అవ‌కాశం ఉండ‌దు. ఆధార్ కార్డులో ఇకపై తండ్రి లేక‌ భర్త అనే ఆప్ష‌న్ వ‌ద్ద కేరాఫ్ అనే ప‌దం మాత్ర‌మే ఉంటుంది.

ఓ ఖాతాదారుడు ఈ విష‌యాన్ని గుర్తించి ఆధార్‌కార్డులో పొరపాటుగా కేరాఫ్ అని ప‌డిందేమో అనుకుని ఆధార్ కేంద్రానికి విషయం తెలిపాడు. అయితే తండ్రి పేరు, భర్త పేరు అనే ప‌దాల‌ను తొల‌గించి కేరాఫ్ అని ఉద్దేశ‌పూర్వ‌కంగానే మార్చామ‌ని అధికారులు తెలిపారు.  

ఇకపై ఆధార్ కార్డులో బంధుత్వాన్ని తెలిపే ప‌దాలు ఉండ‌బోవ‌ని, కేరాఫ్ అని ఉంటుందని చెప్పారు. కార్డుదారుడు కేరాఫ్ లో త‌న సంర‌క్ష‌కుడి పేరును రాస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. పౌరుడి వ్య‌క్తిగ‌త‌ గోప్యత‌కు ఏ విధంగానూ భంగం కలగ‌కూడ‌ద‌ని గ‌తంతో సుప్రీంకోర్టు చేసిన సూచ‌న‌ల మేర‌కు అధికారులు ఈ మార్పులు చేసిన‌ట్లు తెలుస్తోంది.


More Telugu News