గొడవలతో మోసం చేసింది చాలు.. ‘మా’ ఎన్నికలపై బండ్ల గణేశ్​ సంచలన ప్రకటన

  • ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకొన్న నటుడు
  • జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నానని ప్రకటన
  • రెండేళ్లు పదవుల్లో ఉన్న వారు ఏమీ చేయలేదని మండిపాటు
  • పేద కళాకారులకు డబుల్ బెడ్రూంలు ఇప్పిస్తానని హామీ
  • అదే ‘మా’లో నిజమైన అభివృద్ధి అని కామెంట్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ గొడవలు పెట్టుకుని మోసం చేసింది చాలని, ఇక ‘మా’ను బలోపేతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నానని, ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తానని ఆయన ప్రకటించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకొంటూ ప్రకటన చేసిన కొద్ది సేపటికే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

‘‘మనస్సాక్షికి ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. పోటీ చెయ్ అంటోంది. అందుకే పోటీ చేస్తున్నాను. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను. ఎవరి మాటా వినను. అందరికీ ఎన్నో అవకాశాలను ఇచ్చారు. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. మాట తప్పను.. మడమ తిప్పను. నాది ఒకటే మాట.. ఒకటే బాట. నమ్మడం.. నన్ను నమ్మిన వారి కోసం బతకడం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

తన పరిపాలన ఎలా ఉంటుందో అందరికీ చూపిస్తానని, వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిండచమే తన ధ్యేయమని ఆయన అన్నారు. దాని కోసం పోరాడి వారి సొంతింటి కలను నిజం చేస్తానని చెప్పారు. ఇప్పుడున్న పదవులు అనుభవిస్తున్న వారు రెండేళ్లుగా ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు చేస్తామన్నా కూడా నమ్మేందుకు ‘మా’ సభ్యులు సిద్ధంగా లేరని అన్నారు. పేద కళాకారులకు ఇళ్ల కలను నిజం చేయడమే నిజమైన అభివృద్ధి అన్నారు.

కాగా, అంతకుముందు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకొంటున్నట్టు బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. తనను వారి ప్యానెల్ అధికార ప్రతినిధిగా ఎన్నుకొన్నందుకు కృతజ్ఞతలని, కానీ, తన వ్యక్తిగత కారణాలతో ఆ బాధ్యతను నిర్వహించలేనని చెప్పారు. ఆ పదవికి వేరొకరిని ఎన్నుకోవాలని సూచించారు.


More Telugu News