హైదరాబాద్‌లో మళ్లీ దంచికొట్టిన వాన..  నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణశాఖ

  • తీవ్ర అవస్థలు పడిన నగర వాసులు
  • మునిగిన ముూసారాంబాగ్ వంతెన
  • అంబర్‌పేట-దిల్‌సుఖ్ నగర్ మధ్య సాయంత్రం వరకు నిలిచిపోయిన రాకపోకలు
  • సైదాబాద్‌లో అత్యధికంగా 10.4 సెంటీమీటర్ల వాన
  • బంగాళాఖాతంలో రేపటి లోగా అల్పపీడనం
హైదరాబాద్‌లో వర్షం మరోమారు బీభత్సం సృష్టించింది. నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షానికి ప్రజలు అల్లాడిపోయారు. మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. ఇక, నిన్న కురిసిన వర్షానికి ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు మరోమారు జలమయ్యాయి. ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా మూసారాంబాగ్ బ్రిడ్జి మునిగిపోయింది. ఫలితంగా అంబర్‌పేట, దిల్‌సుఖ్ నగర్ మధ్య సాయంత్రం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లలోకి చేరింది. అంబర్‌పేటలోని ఆబ్కారీ కార్యాలయంలోకి అడుగు మేర నీరు చేరింది. దిల్‌సుఖ్ నగర్‌ కోదండరామనగర్‌ వరద నీటిలో చిక్కుకుంది. సరూర్ నగర్ చెరువు నీరు రోడ్లపై నుంచి మోకాళ్ల లోతులో ప్రవహించింది. సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోని కుర్మగూడ (సైదాబాద్)లో అత్యధికంగా 10.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. ఫలితంగా మూసీనది ఉరకలు వేస్తోంది.

బంగాళాఖాతం తూర్పు, మధ్య ప్రాంతంలో 4.3 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రేపటిలోగా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. దీనికితోడు  చత్తీస్‌గఢ్‌పై 2.1 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో అప్పటికప్పుడు కారుమబ్బులు కమ్ముకుని కొన్ని గంటల్లోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్టు అధికారులు తెలిపారు.


More Telugu News