సీజేఐకి లేఖ రాసిన బాలిక... ప్రజాప్రయోజన వ్యాజ్యంగా నమోదు చేసిన సుప్రీంకోర్టు

  • దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • తెరుచుకుంటున్న విద్యాసంస్థలు
  • కోర్టులు ఎందుకు తెరుచుకోవన్న బాలిక
  • తన లేఖతో సీజేఐని ఆలోచనలో పడేసిన బాలిక
సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీజేఐ ఎన్వీ రమణకు ఓ బాలిక లేఖ రాయగా, ఆ లేఖను ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంగా సుప్రీంకోర్టు నమోదు చేసుకుంది. దేశంలో పాఠశాలలు తెరుచుకోవడంపై ఆ బాలిక సీజేఐకి లేఖ రాసింది.

పాఠశాలలు తెరుచుకోగా, కోర్టులు మాత్రం ఇప్పటికీ ప్రత్యక్ష కార్యకలాపాలకు దూరంగా వర్చువల్ విధానంలోనే కార్యాచరణ కొనసాగిస్తున్న వైనాన్ని ఆ బాలిక తన లేఖలో ప్రస్తావించింది. స్కూళ్లు తెరుచుకున్నప్పుడు కోర్టులు ఎందుకు తెరుచుకోవు? అని బాలిక ప్రశ్నించింది. సీజేఐని సన్మానించేందుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ ఈ మేరకు వెల్లడించారు. ఈ లేఖను సీజేఐ ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించారని, త్వరలోనే దీనిపై విచారణ జరగనుందని తెలిపారు.

కరోనా మహమ్మారి వెలుగుచూసినప్పటి నుంచి దేశంలో కోర్టులు వర్చువల్ విధానంలోనే విచారణలు కొనసాగిస్తున్నాయి. న్యాయ వ్యవస్థ 2020 మార్చి నుంచి ఆన్ లైన్ విధానంలో నడుస్తోంది. సుప్రీంకోర్టులో సెప్టెంబరు 1 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణకు అనుమతించినా, కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవుతారో, లేక వర్చువల్ గా వాదనలు వినిపిస్తారో న్యాయవాదులే నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించారు. అయితే న్యాయవాదుల్లో అత్యధికులు ఇప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించేందుకే మొగ్గు చూపుతున్నారు.


More Telugu News