మంచి న్యాయమూర్తి.. అంతకుమించి మంచి మానవతామూర్తి: సీజేఐ జస్టిస్​ రమణపై సొలిసిటర్​ జనరల్​ ప్రశంసల వర్షం

  • దేవుడంటే భయపడని వ్యక్తి  
  • న్యాయవాదులందరికీ ఆయనే కర్త
  • పక్షపాతం లేకుండా తీర్పులనిస్తారు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనో మంచి న్యాయమూర్తి అని, అంతకు మించి ఓ మంచి మానవతామూర్తి అని పొగడ్తలతో ముంచెత్తారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తనకు ఎంతో కాలంగా తెలుసన్నారు. జస్టిస్ రమణ.. దేవుడంటే భయపడే వ్యక్తి కాదని, దేవుడిని ప్రేమించే వ్యక్తని అన్నారు.

న్యాయశాస్త్రపరంగా ఎంతో తెలివైన వ్యక్తి అని తుషార్ మెహతా కొనియాడారు. పక్షపాతం లేకుండా తీర్పులను ఇస్తారన్నారు. తమ న్యాయవాదుల కుటుంబానికి ఆయనే ‘కర్త’ అని ప్రశంసించారు. బార్ కౌన్సిల్ చైర్మన్ ఎం.కె. మిశ్రా వ్యాఖ్యలపై చీఫ్ జస్టిస్ రమణకు ఆయన క్షమాపణలు చెప్పారు. ఓ న్యాయమూర్తికి నిర్వహిస్తున్న సత్కార కార్యక్రమంలో న్యాయవాదుల కష్టాల చిట్టాపై ఎం.కె. మిశ్రా చాలాసేపు మాట్లాడారని అన్నారు. అయితే, ఆ విజ్ఞప్తులను సీజేఐ జస్టిస్ రమణ పరిశీలించాలని కోరారు.


More Telugu News