ఏపీలో రేపు ప్రైవేట్ స్కూళ్లు బంద్.. ఫెడరేషన్ ఆఫ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ ప్రకటన

  • ఫీజులకు సంబంధించి కొత్త జీవోలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఈ జీవోల వల్ల నష్టం జరుగుతుందన్న స్కూల్స్ అసోసియేషన్
  • విద్యా సంస్థలకు నష్టం జరిగితే విద్యార్థులకు సరైన భవిష్యత్తు ఉండదని వ్యాఖ్య
ఏపీలో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు రేపు బంద్ పాటిస్తున్నారు. ఇటీవల ప్రైవేట్ స్కూళ్ల ఫీజులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీనుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బంద్ పాటిస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ ప్రకటించింది. విజయవాడలో నిర్వహించిన పత్రికా సమావేశంలో స్కూల్స్ అసోసియేషన్ బంద్ నిర్ణయాన్ని వెల్లడించింది.

ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలతో తాము ఏకీభవించడం లేదని చెప్పారు. డాక్టర్లు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందిని ఫ్రంట్ లైన్ వర్కర్లు అంటున్నారని... ఉపాధ్యాయులమైన తాము ఫ్యూచర్ లైఫ్ వర్కర్లమని అన్నారు. ఫ్యూచర్ లైఫ్ వర్కర్లమైన తాము సరిగా లేకపోతే... విద్యార్థులకు సరైన భవిష్యత్తే ఉండదని చెప్పారు.

 ఆచరణసాధ్యం కాని జీవోలను విడుదల చేసేముందు ఆలోచించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ జీవోల వల్ల నష్టమే జరుగుతుందని... నాణ్యమైన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతారని అన్నారు. జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.

ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎంత ఫీజు వసూలు చేయాలో నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 53, 54 తీసుకొచ్చింది. ఈ ఫీజులు ఈ విద్యా సంవత్సరం నుంచి 2023-24 విద్యా సంవత్సరం వరకు వర్తిస్తాయని జీవోల్లో పేర్కొంది.


More Telugu News