అక్క‌డ మ‌ద్యం కొనాలంటే ఆధార్ కార్డు, వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి!

  • తమిళ‌నాడులోని నీలగిరి జిల్లా అధికారుల వినూత్న ప్ర‌యోగం
  • క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు నిబంధ‌న‌లు
  • 100 శాతం వ్యాక్సినేష‌న్ పూర్త‌య్యే వ‌ర‌కు ఆంక్ష‌లు
క‌రోనా విజృంభ‌ణ వేళ మ‌ద్యం దుకాణాల ముందు మందుబాబుల‌ను నియంత్రించ‌డం పెద్ద స‌వాలుగా మారింది. మందుషాపులకు ఎంత‌గా గిరాకీ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పే అవ‌స‌రం లేదు. సాయంత్రం స‌మ‌యంలో ఆ దుకాణాల ముందు మందుబాబులు ఎగ‌బ‌డ‌తారు. మద్యం దుకాణాల వ‌ద్ద క‌రోనా నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న ప్ర‌తిరోజు జ‌రుగుతోంది. దీంతో త‌మిళ‌నాడులోని నీలగిరి జిల్లా అధికారులు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  

దుకాణాల్లో మ‌ద్యం కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరు ఆధార్‌ కార్డుతో పాటు రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసుకురావాలని నిబంధ‌న‌లు విధించారు. వాటిని తీసుకొస్తేనే మద్యం విక్రయించాల‌ని దుకాణాల సిబ్బందికి చెప్పారు. ఆ జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఈ నిబంధన అమలులో ఉంటుందని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఈ నిబంధనలకు సంబంధించిన ఫ్లెక్సీలను మ‌ద్యం దుకాణాల ముందు ఏర్పాటు చేశారు.


More Telugu News