గోప్యతా నిబంధనల ఉల్లంఘన.. వాట్సాప్​ కు భారీ జరిమానా!

  • రూ.1,952 కోట్ల ఫైన్ వేసిన ఐర్లాండ్
  • 8 ఈయూ దేశాలు ఫిర్యాదు చేశాయన్న డీపీసీ
  • తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వాట్సాప్
  • అంత ఫైన్ దారుణమని అసహనం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు భారీ జరిమానా పడింది. గోప్యతా నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (డీపీసీ) సుమారు రూ.1,952 కోట్ల (22.5 కోట్ల యూరోలు) ఫైన్ ను విధించింది. 2018 కేసుకు సంబంధించి ఈ జరిమానా వేసింది.

ప్రజలకు పారదర్శకమైన సమాచారాన్ని అందించడం లేదని, వినియోగదారుల సమాచారాన్ని ఎంత వరకు వాడుకుంటున్నారు? దానిని ఎలా ప్రాసెస్ చేస్తున్నారన్న దానిపై స్పష్టతలేదని పేర్కొంటూ జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ సహా 8 దేశాల నుంచి సంస్థపై పలు ఫిర్యాదులు వచ్చాయని, అన్నింటినీ విచారించాకే సంస్థ గోప్యతా నిబంధనలను ఉల్లంఘించినట్టు తేల్చామని డీపీసీ తెలిపింది.  

అయితే, డీపీసీ నిర్ణయంపై వాట్సాప్ అసహనం వ్యక్తం చేసింది. తాము ఏ తప్పూ చేయలేదని, సురక్షితమైన, గోప్యమైన సేవలను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఎప్పుడూ పారదర్శకమైన విధానాలనే అమలు చేస్తున్నామని, నిబంధనలకు లోబడి నడుచుకుంటున్నామని తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం దారుణమని వాపోయింది.

కాగా, ఐరోపా సమాఖ్య జనరల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ చరిత్రలోనే ఇది రెండో భారీ ఫైన్ కావడం గమనార్హం. నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలకు.. ఆయా సంస్థల వార్షిక టర్నోవర్ లో 4 శాతం దాకా జరిమానాలను ఐర్లాండ్ విధిస్తుంది.


More Telugu News