న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసు.. లింగారెడ్డి రాజశేఖరరెడ్డిపై చార్జ్‌షీట్ దాఖలు

  • న్యాయవ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదిస్తూ పోస్టులు
  • మొత్తం 16 మంది నిందితులు
  • కువైట్ నుంచి పోస్టులు.. జులై 9న అరెస్ట్
  • కేసు నమోదైన వెంటనే పోస్టుల లింకుల తొలగింపు
న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించడం, వారి తీర్పులను వక్రీకరించడం, న్యాయమూర్తులను దూషించడం, వారిపై కుల ముద్ర వేస్తూ సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నమోదైన కేసులో సీబీఐ నిన్న చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో కడపకు చెందిన లింగారెడ్డి రాజశేఖరరెడ్డి (40) సహా 16 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో లింగారెడ్డి రాజశేఖరరెడ్డిపై సీబీఐ అధికారులు నిన్న గుంటూరులోని నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు (సీబీఐ డిజిగ్నేటెడ్ కోర్టు)లో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

కడపలోని స్థానిక సరోజినీనగర్‌కు చెందిన రాజశేఖరరెడ్డి మూడేళ్లుగా కువైట్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను దూషించడం, వారి తీర్పులకు దురుద్దేశాలు ఆపాదించడంతోపాటు వారికి ప్రాణహాని కలిగిస్తామంటూ పోస్టులు పెట్టారన్న అభియోగాలపై గతంలో సీబీఐ కేసులు నమోదు చేసింది. వీరిలో లింగారెడ్డి కూడా ఉన్నాడు. ఇటీవల ఆయన కువైట్ నుంచి స్వస్థలానికి రాగా జులై 9న సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు.

కేసు నమోదైన వెంటనే రాజశేఖరరెడ్డి తాను పెట్టిన పోస్టుల లింకులను తొలగించాడు. అతని ఆధార్‌కార్డు, పాస్‌పోర్టులలో ఇంటి పేరు, పుట్టిన తేదీ వేర్వేరుగా ఉన్నట్టు గుర్తించారు. పోస్టులు షేర్ చేసిన సెల్‌ఫోన్ నీళ్లలో పడిపోయిందని విచారణలో చెప్పాడని సీబీఐ పేర్కొంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడం వెనక ఎవరున్నారనే వివరాలను రాబట్టి చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది.


More Telugu News