తెలంగాణ కోసం ముందుకొచ్చిన నా బిడ్డ షర్మిలను దీవించండి: వైఎస్సార్ సంస్మరణ సభలో విజయమ్మ

  • వైఎస్సార్ ఇంకా తెలంగాణలో నడయాడుతున్నట్టే ఉంది: విజయమ్మ
  • ఓ ప్రాంత ప్రజలు నిర్లక్ష్యానికి గురవుతుంటే చూస్తూ ఊరుకోలేను: షర్మిల
  • వైఎస్ ఇంకో పదేళ్లు బతికి ఉంటే దేశంలోనే గొప్ప నేత అయి ఉండేవారు: కోమటిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకుని నిన్న హైదరాబాద్‌లోని నొవాటెల్‌లో వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. వైఎస్‌తో అనుబంధం ఉన్న, ఆయనతో కలిసి పనిచేసిన నేతలను విజయమ్మ స్వయంగా ఆహ్వానించారు.

అయితే, ఏపీ నుంచి వైసీపీ నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరూ ఈ సభకు హాజరు కాకపోవడం గమనార్హం. తెలంగాణ కాంగ్రెస్ నుంచి మాత్రం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కరే హాజరయ్యారు. అలాగే, బీజేపీ నేత జితేందర్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు సభకు హాజరయ్యారు. ఆహ్వానాలు అందినా టీఆర్ఎస్, మజ్లిస్, వామపక్ష నేతలు హాజరు కాలేదు.

ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. ఇది రాజకీయ సభ కాదని, వైఎస్సార్ సంస్మరణ సభ మాత్రమేనని స్పష్టం చేశారు. వైఎస్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ నిలిచే ఉన్నాయన్నారు. సభలో మాట్లాడిన వారి ప్రేమాభిమానాలు చూస్తుంటే వైఎస్సార్ తెలంగాణలో నడయాడుతున్నట్టు అనిపిస్తోందన్నారు. తన బిడ్డ షర్మిల తెలగాణ కోసం ముందుకొచ్చిందని, రాజన్న రాజ్యం కోసం తన బిడ్డను ఆశీర్వదించాలని కోరారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ.. తన తండ్రి ప్రేమించే ప్రజల్లో ఒక ప్రాంత ప్రజలు నిర్లక్ష్యానికి గురై నీరుగారిపోతుంటే చూస్తూ ఊరుకోలేనని, వైఎస్సార్ వర్ధంతినాడు మాట ఇస్తున్నానని, నాన్న ప్రేమించిన తెలంగాణ ప్రజల కోసం నిలబడతానన్నారు. వారి కోసం తాను కొట్లాడతానని, నిలబడి సేవ చేస్తానని అన్నారు. వైఎస్ ఇంకో పదేళ్లు బతికి ఉంటే దేశంలోనే గొప్ప నాయకుడు అయి ఉండేవారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. వైఎస్ శిష్యుడిగా పుట్టడం తన అదృష్టమని అన్నారు.


More Telugu News