తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 14 రకాల వంటకాలతో భోజనం!

  • ఏపీ, తమిళనాడు, కర్ణాటక కూరగాయల దాతలతో అదనపు ఈవో ధర్మారెడ్డి సమావేశం
  • ఒక్కో యూనిట్‌కు 48 కిలోల చొప్పున కూరగాయలు అవసరం
  • దాతలను సన్మానించిన ధర్మారెడ్డి
తిరుమల శ్రీవారి భక్తులకు ఇది నిజంగా పెద్ద శుభవార్తే. ఇకపై ఉదయం, సాయంత్రం వేళల్లో వేర్వేరు మెనూతో భోజనం అందించాలని టీటీడీ నిర్ణయించింది. 14 రకాల వంటకాలతో రుచికరమైన అన్న ప్రసాదాన్ని అందించాలని నిర్ణయించినట్టు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో నిన్న ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన 14 మంది కూరగాయల దాతలతో సమావేశమైన అనంతరం ధర్మారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. సమావేశం అనంతరం ధర్మారెడ్డి వారిని సన్మానించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ.. అన్నప్రసాదం విభాగం కోరిన మెనూ ప్రకారం కూరగాయలు సరఫరా చేసేందుకు దాతలు అంగీకరించినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం రోజుకు 90 యూనిట్ల (యూనిట్‌కు 250 మంది) అన్న ప్రసాదం తయారు చేస్తున్నారు. దీనిని బట్టి ప్రస్తుత అవసరాలకు ఒక్కో యూనిట్‌కు 48 కిలోల కూరగాయలు అవసరమవుతాయని వివరించారు.

 అలాగే గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించాలని దాతలను కోరారు. ఇక, దర్శన సమయంలో ప్రతి రోజూ 500 అరటిపండ్లను శ్రీవాణి ట్రస్టు భక్తులకు అందించేందుకు దాతలు ముందుకొచ్చారు.


More Telugu News