నా వెంట వస్తే చూపిస్తా... దిగజారి మాట్లాడొద్దు: హరీశ్ రావుపై ఈటల ఫైర్

  • హరీశ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు
  • హరీశ్ ప్రతి మాట వ్యంగ్యంగా ఉంటోంది
  • హరీశ్ ఇలాగే మాట్లాడితే అసహ్యించుకుంటారు
హుజూరాబాద్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తరపున బరిలో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఓడించేందుకు టీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మంత్రి హరీశ్ రావు గత కొన్ని రోజులుగా హుజూరాబాద్ కే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామితో కలిసి మాట్లాడిన ఈటల రాజేందర్... హరీశ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. హరీశ్ రావు మతి భ్రమించి, ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

హరీశ్ మాట్లాడే ప్రతి మాట వ్యంగ్యంగా ఉంటోందని... అన్నీ అసత్యాలే మాట్లాడుతున్నారని ఈటల విమర్శించారు. హుజూరాబాద్ లో అభివృద్ధే జరగలేదని హరీశ్ అంటున్నారని... ఈ అసత్య ప్రచారంపై చర్యకు హరీశ్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఉన్నతమైన స్థానంలో ఉన్న హరీశ్ దిగజారి మాట్లాడటం బాధాకరమని అన్నారు. హరీశ్ విచక్షణ కోల్పోయి ఇలాగే మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటారని చెప్పారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించలేదని తనపై హరీశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని... జమ్మికుంట, కమలాపూర్, హుజూరాబాద్ లలో 500ల చొప్పున ఇళ్లు కట్టించానని ఈటల తెలిపారు. హరీశ్ తనతో పాటు వస్తే వీటిని చూపిస్తానని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ లు... ఈ రాష్ట్రం మాది, ఈ రాష్ట్రాన్ని మేమే సాధించామనే రీతిలో మాట్లాడుతున్నారని విమర్శించారు.

హరీశ్ రావు, కేసీఆర్, కేటీఆర్ లు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల మధ్యలో ఉన్న దుబ్బాకలో రోడ్లు వేశారా? డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించారా? అని ఈటల ప్రశ్నించారు. ఏమీ చేయనందుకే దుబ్బాకలో టీఆర్ఎస్ ను జనాలు ఓడించారని అన్నారు. తన మీద విమర్శలు గుప్పించినంత మాత్రాన గొప్ప వ్యక్తులు కాబోరని చెప్పారు.

తన వెనకున్న కార్యకర్తలు, తనకు మద్దతు పలుకుతున్న వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. కాంట్రాక్టర్ల బిల్లులను కూడా ఆపేశారని.. టీఆర్ఎస్ తో ఉంటేనే బిల్లులు మంజూరు చేస్తామని చెపుతున్నారని దుయ్యబట్టారు. తాను నియమించిన కాంట్రాక్టు ఉద్యోగులు, ఆసుపత్రుల్లో పని చేస్తున్న వారిని తొలగిస్తున్నారని అన్నారు. రేషన్ డీలర్లను కూడా బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News