ఆట ఇంకా మిగిలే ఉంది.. టెస్టు సిరీస్ గెలుపు సాధ్యమే అంటున్న రవిశాస్త్రి

  • మూడో టెస్టు ఓటమి మర్చిపోవాలని చెప్పిన కోచ్
  • లార్డ్స్ విజయం నుంచి ప్రేరణ తీసుకోవాలని సూచన
  • తన ‘స్టార్ గేజింగ్’ పుస్తకావిష్కరణ సభలో వ్యాఖ్యలు
ఇంగ్లండ్‌లో జరుగుతున్న టెస్టు సిరీస్‌ మూడో మ్యాచులో ఘోరంగా ఓడిపోయిన టీమిండియాకు ఇంకా సిరీస్ గెలిచే అవకాశాలున్నాయని జట్టు కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఐదు మ్యాచుల ఈ టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ చివరిరోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది.

ఇక రెండో టెస్టులో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. అదే ఊపులో మూడో మ్యాచులో బరిలోకి దిగిన కోహ్లీ సేన.. తొలి ఇన్నింగ్సులో 78 పరుగులకే ఆలౌటయింది. ఇలా కుప్పకూలినప్పటికీ రెండో ఇన్నింగ్సులో భారత జట్టు బాగా పుంజుకుందని రవిశాస్త్రి అన్నారు.

 తాను ఇటీవల రచించిన ‘స్టార్ గేజింగ్’ పుస్తకావిష్కరణ సభలో మీడియాతో ఆయన మాట్లాడారు. లార్డ్స్ మైదానంలో సాధించిన గొప్ప విజయం నుంచి ప్రేరణ పొందాలని ఆయన సూచించారు. ఇది చెప్పడం చాలా తేలికగా ఉన్నప్పటికీ చాలా కష్టమైన పని అని అన్నారు. కానీ మంచి జ్ఞాపకాలను నెమరువేసుకోవాలని, ఆటలో ఓటములు సహజమేనని వివరించారు.

లార్డ్స్ టెస్టులో టీమిండియా ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి ఘనవిజయం సాధించిందన్నారు. మూడో టెస్టులో ఇంగ్లండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిందన్న రవిశాస్త్రి.. రెండో ఇన్నింగ్సులో భారత జట్టు బాగానే పుంజుకుందని అభిప్రాయపడ్డారు. ఈ సిరీస్‌లో ఇప్పటికీ గెలిచే అవకాశాలున్నాయని స్పష్టంచేశారు. ఎవరైనా సరే ప్రస్తుత భారత జట్టును తక్కువగా అంచనా వేస్తే దెబ్బతింటారని రవిశాస్త్రి హెచ్చరించారు. సొంతగడ్డపై ఆడుతున్న ఇంగ్లండ్‌ జట్టు మీదే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని చెప్పారు.


More Telugu News