కామినేని ఆసుపత్రిని మోసం చేసిన అభియోగాలు.. తమిళనాడు నేతను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు

  • కామినేని ఆసుపత్రికి రూ. 300 కోట్ల రుణాలు ఇప్పిస్తానని మోసం
  • డాక్యుమెంట్ చార్జీల కింద రూ. 5 కోట్లు వసూలు
  • కారైకుడిలో అరెస్ట్ చేసి తెలంగాణకు తరలింపు
కామినేని ఆసుపత్రిని మోసం చేసిన కేసులో తమిళనాడులోని శివగంగై జిల్లా కారైకుడికి చెందిన ఓ రాజకీయ పార్టీ నేత ఎస్సార్ దేవర్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. మూవేందర్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శిగా, ఐదు జిల్లాల రైతు సంఘాల అధ్యక్షుడిగా ఉన్న దేవర్.. కామినేని ఆసుపత్రికి రూ. 300 కోట్ల రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికారు. ఇందుకోసం 2018లో 5 కోట్ల రూపాయలను డాక్యుమెంట్ చార్జీల కింద ఆసుపత్రి నుంచి వసూలు చేసి ఆపై మొహం చాటేశారు.

ఈ క్రమంలో, కామినేని ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా నిన్న ఐదుగురితో కూడిన పోలీసు బృందం కారైకుడిలో దేవర్‌ను అదుపులోకి తీసుకుంది. అనంతరం కారైకుడి నార్త్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. తర్వాత ఆయనను హైదరాబాదుకు తీసుకెళ్లారు. కాగా, ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో దేవర్ అన్నాడీఎంకే కూటమి తరపున తిరుచుళి నుంచి పోటీ చేశారు.


More Telugu News