అక్రమ దుకాణాలు ఖాళీ చేయించడానికి వెళ్లిన పోలీసులపై దాడి.. మహిళా ఏసీపీ వేళ్లను నరికేసిన వ్యాపారి!

  • మహారాష్ట్రలోని థానేలో ఘటన
  • కత్తితో దాడిచేసిన కూరగాయల వ్యాపారి
  • తెగిపడిన ఏసీపీ కల్పితా పింపుల్‌ చేతి వేళ్లు
అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను ఖాళీ చేయించేందుకు వెళ్లిన పోలీసులపై దాడిచేసిన వ్యాపారులు ఓ మహిళా ఏసీపీ చేతి వేళ్లను తెగ్గోశారు. మహారాష్ట్రలోని థానేలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్లు, ఫుట్‌పాత్‌లపై వీధి వ్యాపారులు అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను ఖాళీ చేయించాలని థానే మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ డాక్టర్ విపిన్ శర్మ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. అధికారులతో కలిసి దుకాణాలు, తోపుడు బండ్లను ఖాళీ చేయిస్తున్నారు.

ఘోడ్‌బందర్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఇలానే దుకాణాలు ఖాళీ చేయిస్తుండగా కూరగాయల వ్యాపారి అమర్జీత్ యాదవ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కల్పితా పింపుల్‌పై కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో ఆమె మూడు వేళ్లు తెగిపోయాయి. ఆమె తలకు కూడా గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఏసీపీతోపాటే ఉన్న సెక్యూరిటీగార్డు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడు అమర్జీత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


More Telugu News