తాలిబన్​ ఎఫెక్ట్​: హైదరాబాద్​ లో బిర్యానీ ధరలను భారీగా పెంచేసిన రెస్టారెంట్లు

తాలిబన్​ ఎఫెక్ట్​: హైదరాబాద్​ లో బిర్యానీ ధరలను భారీగా పెంచేసిన రెస్టారెంట్లు
  • ఆగిపోయిన మసాల దినుసుల దిగుమతులు
  • భారీగా పెరిగిపోయిన ధరలు
  • బిర్యానీపై పడిన దాని ప్రభావం
  • బిర్యానీ ధర రూ.100కు పైగా పెంపు
హైదరాబాద్ బిర్యానీ అనగానే.. లొట్టలేసుకుంటూ ఆరగించేవాళ్లు చాలా మందే ఉంటారు. అలాంటి బిర్యానీ ప్రియులకు ఇది ఒకింత మింగుడుపడని విషయమే. బిర్యానీ ధరలను రెస్టారెంట్లు భారీగా పెంచేశాయి. కారణం.. ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం.. ఆ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించేసుకోవడం.

బిర్యానీలో వాడే రకరకాల మసాల దినుసులు మనకు ఆఫ్ఘనిస్థాన్ నుంచే దిగుమతి అవుతుంటాయి. చాలా మంది కాబూలీలు ఇక్కడే ఉంటూ ఆ దినుసుల వ్యాపారం చేస్తుంటారు. అయితే, తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించుకోవడం వల్ల ఇప్పుడు భారత్ కు ఆ మసాల దినుసుల దిగుమతి ఆగిపోయింది. దీంతో అంజీర్, షాజీరా, బ్లాక్ ఆప్రికాట్, గ్రీన్ ఆప్రికాట్ తదితర మసాలల ధరలు భారీగా పెరిగిపోయాయి.

ఆ ప్రభావం బిర్యానీలపై పడింది. రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు బిర్యానీపై సగటున రూ.100కుపైనే పెంచేశారు. జులైలో ఓ ప్లేట్ బిర్యానీ ధర రూ.250 ఉండగా ఇప్పుడు రూ.350కి పెరిగింది. నెల క్రితం జంబో ప్యాక్ ధర రూ.600 ఉండగా.. ఇప్పుడు రూ.700 నుంచి రూ.800 దాకా అమ్ముతున్నారు. ఫ్యామిలీ ప్యాక్ ధర రూ.400 నుంచి రూ.550కి ఎగబాకింది. ఆన్ లైన్ లో ఆర్డర్స్ పెట్టుకునేవారికి జీఎస్టీ, ప్యాకింగ్ చార్జీలు, డెలివరీ చార్జీలు అదనం. బిర్యానీ అంటే ఎంత ఇష్టమైనా.. దాని ధర ఒకేసారి రూ.100కుపైగా పెరగడమంటే మింగుడుపడని విషయమే కదా!!


More Telugu News