వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తే నేనూ లడ్డూ తినిపిస్తా: ఖట్టర్‌కు అమరీందర్ ఆఫర్

  • హర్యానా రైతులను రెచ్చగొడుతున్నారని పంజాబ్ సీఎంపై ఖట్టర్ ఫైర్
  • చెరకు రైతులపై పోలీసుల దాడితో విమర్శలు
  • తాము రైతుల పక్షమేనని తేల్చేసిన అమరీందర్ సింగ్
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్ఎల్ ఖట్టర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తే రైతులే కాకుండా, తాను కూడా ఖట్టర్‌కు లడ్డూ తినిపిస్తానని ఆయన అన్నారు. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ పంజాబ్, హర్యానాల్లోని రైతులు కొంతకాలంగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

 ఈ నేపథ్యంలో తాజాగా ఖట్టర్ మాట్లాడుతూ.. పక్క రాష్ట్ర సీఎం అమరీందర్, హర్యానా కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా ఇద్దరూ కలిసి రాష్ట్రంలోని రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. అమరీందర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విమర్శలపై స్పందించిన అమరీందర్.. రైతులు వ్యతిరేకిస్తున్న వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే కేవలం రైతులేకాదు, తాను కూడా ఖట్టర్‌కు లడ్డూలు తినిపిస్తానని ఆఫర్ ఇచ్చారు.

తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన అమరీందర్.. తనకు రైతులు లడ్డూ తినిపిస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఖట్టర్‌పై మండిపడిన ఆయన కర్నాల్‌లో చెరకు రైతులపై జరిగిన లాఠీ చార్జిని సమర్థించుకునే ప్రయత్నం చేశారంటూ దుయ్యబట్టారు. ప్రశాంతంగా నిరసనలు చేస్తున్న రైతులపై పోలీసులు విరుచుకుపడిన ఈ ఘటనను నేరపూరిత దాడిగా అమరీందర్ అభివర్ణించారు.

‘‘మీ రాష్ట్ర రైతులే మీమీద కోపంగా ఉన్న సంగతి మీకు కనిపించడం లేదా? వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విషయంలో మీ పార్టీ మొండితనం, రైతుల విషయంలో మీ నిర్లక్ష్యమే దానికి కారణం. మాపై నిందలు వేసే ముందు వ్యవసాయ రంగాన్ని మీ పార్టీ తోసిన నిప్పుల కొలిమి నుంచి రక్షించడం కోసం వ్యవసాయ చట్టాలు రద్దు చేయండి’’ అంటూ ఖట్టర్‌కు సలహా ఇచ్చారు.


More Telugu News