ఈడీ నోటీసులను ప్రేమలేఖలతో పోల్చిన శివసేన ఎంపీ

  • మహారాష్ట్రలో శివసేన వర్సెస్ బీజేపీ
  • మంత్రి అనిల్ పరబ్ కు ఈడీ నోటీసులు
  • ఇవేమీ డెత్ వారెంట్లు కాదన్న సంజయ్ రౌత్
  • ఇటీవల ప్రేమలేఖలు ఎక్కువయ్యాయని వ్యంగ్యం
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ కు ఈడీ నోటీసులు పంపడంపై ఆసక్తికరంగా స్పందించారు. తమ వంటి రాజకీయ నాయకులకు ఈడీ నోటీసులు ప్రేమలేఖల వంటివని అభివర్ణించారు. అంతేతప్ప ఈడీ నోటీసులను తాము డెత్ వారెంట్లుగా పరిగణించే పరిస్థితి లేదని వివరించారు.

ఇటీవల సీఎం ఉద్ధవ్ థాకరేపై కేంద్రమంత్రి నారాయణ్ రాణే తీవ్ర వ్యాఖ్యలు చేయగా, మహారాష్ట్ర పోలీసులు రాణేను అరెస్ట్ చేశారు. అందుకు బదులుగానే మహారాష్ట్ర మంత్రికి ఈడీ నోటీసులు పంపారని శివసేన ఆరోపిస్తోంది.  మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్, మరికొందరిపై నమోదైన రూ.100 కోట్ల అక్రమాల కేసులో ఈడీ మంత్రి అనిల్ పరబ్ కు నిన్న నోటీసులు పంపింది.

తిరుగులేని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇటీవల ఇలాంటి ప్రేమలేఖలు ఎక్కువయ్యాయని సంజయ్ రౌత్ వ్యంగ్యం ప్రదర్శించారు. ఈడీ తరచుగా నోటీసులు పంపడం చూస్తుంటే... ఈడీ కార్యాలయంలో బీజేపీ మనిషైనా ఉండాలి, లేకపోతే బీజేపీ కార్యాలయంలో ఈడీ అధికారైనా పనిచేస్తుండాలని ఎద్దేవా చేశారు. ఇలాంటి నోటీసులతో తమకేమీ కాదని, ఈడీ నోటీసులకు మంత్రి పరబ్ స్పందిస్తారని, విచారణకు సహకరిస్తారని రౌత్ స్పష్టం చేశారు.


More Telugu News