ఆదివాసీని ట్రక్కుకు కట్టేసి ఈడ్చుకెళ్లిన కసాయిలు, తీవ్రగాయాలతో మృతి.. వీడియో వైరల్​

  • మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన
  • రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన పాల వ్యాపారి
  • పాలు ఒలిగిపోవడంతో ఆదివాసీపై దాడి
  • స్నేహితులను పిలిపించి కర్కశత్వం
అతని తప్పేం లేకపోయినా ఆ ఆదివాసీని చితకబాదారు.. ట్రక్కుకు కాళ్లను కట్టేసి ఈడ్చుకెళ్లారు.. తీవ్రగాయాలపాలైన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని నీమూచ్ లో జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

కన్హయ్య లాల్ భీల్ (45) అనే వ్యక్తి రోడ్డుపై వెళ్తుండగా.. చిత్తర్మల్ గుర్జర్ అనే పాల వ్యాపారి బైకుపై వచ్చి ఢీకొట్టాడు. ఇద్దరూ కిందపడిపోయారు. అయితే, పాలు మొత్తం ఒలిగిపోవడంతో కన్హయ్యపై చిత్తర్మల్ దాడికి దిగాడు. తన స్నేహితులను పిలిపించి కొట్టించాడు. ఆ తర్వాత బాధితుడి కాలిని తాడుతో ట్రక్కుకు కట్టేసి ఈడ్చుకెళ్లారు. ఒక నిందితుడు అతడి మొహంపై తన్నాడు. బాధతో విలవిల్లాడుతూ అతడు వేడుకున్నా వినలేదు. ఒళ్లంతా రోడ్డుకి రాసుకుపోయి కన్హయ్యకు తీవ్రగాయాలయ్యాయి.

ఆ ఘటనను చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, వారు అక్కడికి వచ్చే లోపు నిందితులు పారిపోయారు. తీవ్రగాయాలపాలైన భీల్ ను జిల్లా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. 8 మంది ఈ దారుణానికి పాల్పడ్డారని నీమూచ్ జిల్లా ఎస్పీ సూరజ్ కుమార్ వర్మ చెప్పారు. చిత్తర్మల్ తో పాటు మహేంద్ర గుర్జర్, గోపాల్ గుర్జర్, లోకేశ్ బాలాయి, లక్ష్మణ్ గుర్జర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్హయ్యపై దొంగ అనే ముద్ర వేసేందుకు వారు ప్రయత్నించినట్టు పోలీసులు చెప్పారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు.


More Telugu News