జర్నలిస్టుని భయపెట్టి 'భయపడకండి..' అంటూ ప్రజలకు చెప్పించిన తాలిబన్లు.. వీడియో ఇదిగో

  • తాలిబన్లంటే భయం వద్దంటూ కామెంట్
  • వీడియోను ట్వీట్ చేసిన ఇరాన్ జర్నలిస్ట్
  • కొన్ని రోజులుగా జర్నలిస్టులపై తాలిబన్ల దాడులు
‘భయపెట్టడం’.. ఇదే తాలిబన్ల నైజం. భయపడకుంటే కాల్చిపారేయడం ఇదే వారి క్రూరత్వం. అలాంటి వారు ఓ పది మంది తుపాకులు పట్టుకుని మన చుట్టూ చేరితే..! ఓ జర్నలిస్ట్ కు ఇదే అనుభవం ఎదురైంది. ఓ వార్తా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ ను వారు భయపెట్టి.. భయపడొద్దంటూ ఆఫ్ఘన్లకు చెప్పించడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

ఓ 8 మంది సాయుధ తాలిబన్లు ఆ యాంకర్ చుట్టూ ఉండగా.. ‘ఆఫ్ఘన్లెవరూ తాలిబన్లను చూసి భయపడొద్దు. ఇస్లామిక్ ఎమిరేట్ అంటే భయం వద్దు’ అని లైవ్ లో చెప్పాడు. భయపడొద్దు అని చెప్పేటప్పుడు అతడి మాటల్లో భయం కనిపించడం గమనార్హం. అయితే, పత్రికా స్వేచ్ఛను కాపాడుతామని చెప్పిన తాలిబన్లు ఇప్పుడు ఇలా తుపాకులతో భయపెట్టి బెదిరించి చెప్పించడమేంటని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

దానికి సంబంధించిన వీడియోను ఇరాన్ కు చెందిన మాసీ అలీనాజాద్ అనే మహిళా జర్నలిస్టు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కొన్ని రోజుల క్రితం టోలో న్యూస్ కు చెందిన జర్నలిస్టును, కెమెరామ్యాన్ ను తాలిబన్లు చితకబాదారు. జర్నలిస్టులు, వారి బంధువుల ఇళ్లలోకి చొరబడి సోదాలు చేశారు. కాబూల్, జలాలాబాద్ లలో జర్నలిస్టులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో పత్రికా స్వేచ్ఛ ఎక్కడుందని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.


More Telugu News