తాలిబన్లను ఇంటర్వ్యూ చేసిన ఆఫ్ఘన్​ మహిళా జర్నలిస్ట్​ ఇప్పుడు దేశం నుంచి పారిపోయింది!

  • తాలిబన్లంటే భయమని చెప్పిన బెహెస్థా అర్ఘాంద్
  • వారు మారి పరిస్థితులు చక్కబడితే తిరిగివెళ్తానని కామెంట్
  • హక్కులు కావాలని తాలిబన్లకు చెప్పానన్న బెహెస్థా
మహిళలు చదువుకోకూడదు, ఉద్యోగం చేయకూడదు, అసలు బయటకే రాకూడదు అన్నది తాలిబన్ల సిద్ధాంతం. ఇప్పుడైతే మారామని అంటున్నారు గానీ.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగానే ఉన్నాయి. ఇలాంటి స్థితిలోనూ ఈ నెల 17న తాలిబన్ ప్రతినిధిని టోలో న్యూస్ కు చెందిన ఓ మహిళా జర్నలిస్టు ఇంటర్వ్యూ చేసి సంచలనం సృష్టించింది. అదీ ఆఫ్ఘనిస్థాన్ చరిత్రలోనే తొలిసారి. దీంతో ఆమె అందరి మన్ననలను అందుకుంది. ఆమె 24 ఏళ్ల బెహెస్థా అర్ఘాంద్.


అలా చరిత్ర సృష్టించిన ఆ మహిళా జర్నలిస్టే ఇప్పుడు తన జీవితం కోసం దేశం విడిచి పారిపోయింది. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. కొన్ని లక్షల మంది లాగానే తనకూ తాలిబన్లంటే భయమేనని, అందుకే దేశం విడిచి వచ్చేశానని చెప్పింది.

‘‘వారు చెప్పింది చెప్పినట్టు చేసి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అప్పుడు దేశంలో పరిస్థితులు మెరుగై.. నేను సురక్షితం, ఎలాంటి ముప్పు లేదు అని నాకు అనిపిస్తే నా దేశానికి తిరిగి వెళ్లిపోతాను. నా దేశం కోసం, నా దేశ ప్రజల కోసం అక్కడే పనిచేస్తాను’’ అని అర్ఘాంద్ చెప్పింది.

తాలిబన్లతో ఇంటర్వ్యూ చాలా కష్టమైపోయిందని, కానీ, ఆఫ్ఘన్ మహిళల కోసమే చేశానని ఆమె చెప్పుకొచ్చింది. ‘‘మా హక్కులు మాకు కావాలి. మమ్మల్ని పనిచేయనివ్వాలి. మాకంటూ సమాజంలో గుర్తింపు కావాలి. అది మా హక్కు’’ అని తాలిబన్లకు చెప్పానంటూ వివరించింది.

ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు అర్ఘాందే ఒక ఉదాహరణ అని టోలో న్యూస్ యజమాని సాద్ మోహ్సెని చెప్పారు. తమ సంస్థలో పనిచేస్తున్న మంచి మంచి విలేకరులంతా దేశం విడిచి పారిపోయారన్నారు. కొత్త వారిని నియమించుకోవాల్సి వచ్చిందన్నారు. సురక్షితంగా లేము అనుకునేవారిని బయటకు తరలించడం, సంస్థను నడపడం తమకు అతిపెద్ద సవాళ్లన్నారు.


More Telugu News