కామవాంఛలేని స్పర్శను లైంగిక దాడిగా పరిగణించలేం: బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • బాలిక బుగ్గను తాకి, చొక్కా విప్పినట్టు నిందితుడిపై అభియోగాలు
  • పోక్సో చట్టంలోని సెక్షన్-7 ప్రకారం అది లైంగిక దాడిగా పరిగణించలేమన్న ధర్మాసనం
  • నిందితుడికి బెయిలు మంజూరు
గతేడాది జులైలో ఎనిమిదేళ్ల బాలిక బుగ్గను తాకి, చొక్కా విప్పినట్టు ఓ వ్యక్తిపై నమోదైన కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కామ వాంఛ లేకుండా బాలిక బుగ్గలు తాకడాన్ని లైంగిక దాడిగా పరిగణించబోమని, పోక్సో చట్టంలోని సెక్షన్-7 కూడా ఇదే విషయాన్ని చెబుతోందని జస్టిస్ సందీప్ షిండే ఏకసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన తర్వాత నిందితుడు లైంగిక వాంఛతో బుగ్గలు తాకినట్టు అనిపించలేదని పేర్కొన్న ధర్మాసనం ఆరోపణలు ఎదుర్కొంటున్న మహమ్మద్ అహ్మద్ ఉల్లా (46)కు బెయిలు మంజూరు చేసింది.

థానేలో మాంసం దుకాణం నిర్వహిస్తున్న అహ్మద్ ఉల్లా ఎనిమిదేళ్ల చిన్నారిని తన దుకాణానికి పిలిచి బుగ్గను తాకి చొక్కా విప్పాడని, ఆ తర్వాత ప్యాంటు కూడా విప్పబోతుంటే అదే సమయంలో అక్కడికి వెళ్లిన మరో మహిళ గుర్తించి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మహిళ ఫిర్యాదుతో నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు తజోలా జైలులో ఉన్నాడు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, తాను నిరపరాధినని ఉల్లా వాదించాడు. వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడికి బెయిలు మంజూరు చేశారు.


More Telugu News