అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి హాలీవుడ్ సూపర్ స్టార్ కారు కొట్టేసిన దొంగలు

  • మిషన్ ఇంపాజిబుల్-7లో నటిస్తున్న టామ్ క్రూజ్
  • బ్రిటన్ లో షూటింగ్
  • బర్మింగ్ హామ్ లో బసచేసిన క్రూజ్
  • కారు హోటల్లో ఉంచి షూటింగ్ కు వెళ్లిన వైనం
హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ (59) కు దిగ్భ్రాంతికర అనుభవం ఎదురైంది. ప్రస్తుతం టామ్ క్రూజ్ 'మిషన్ ఇంపాజిబుల్-7' సీక్వెల్ లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంగ్లండ్ లో జరుగుతోంది. అయితే, ఆయనకు చెందిన విలాసవంతమైన బీఎండబ్ల్యూ ఎక్స్7 కారును దొంగలు కొట్టేశారు. టామ్ క్రూజ్ షూటింగ్ లో ఉండగా, బర్మింగ్ హామ్ చర్చి స్ట్రీట్ లో ఉన్న గ్రాండ్ హోటల్ వద్ద పార్క్ చేసి ఉన్న కారును దొంగలు ఎత్తుకెళ్లారు.

బీఎండబ్ల్యూ ఎక్స్7 కారును తాళాలతో పనిలేకుండా ఇగ్నిషన్ ఫోబ్ సాయంతో ఇంజిన్ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇందుకోసం ప్రత్యేక సిగ్నల్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. దొంగలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇగ్నిషన్ ఫోబ్ సిగ్నల్ ను స్కానర్ సాయంతో క్లోన్ చేశారు. క్లోన్ చేసిన సిగ్నల్ సాయంతో ఇంజిన్ ను స్టార్ట్ చేసి ఎంచక్కా నడుపుకుంటూ వెళ్లిపోయారు.

అయితే, కారులో ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ డివైస్ ఉండడంతో కారు ఎక్కడున్నది పోలీసులు వెంటనే గుర్తించారు. అప్పటికే దొంగలు కారులో ఉన్న నగదు, విలువైన వస్తువులతో ఉడాయించారు. కారును మాత్రం ఓ గ్రామం వద్ద వదిలేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News