సెప్టెంబరు 30 వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం.. డీజీసీఏ కీలక నిర్ణయం!

  • మరోసారి నిషేధం పొడిగించిన భారత్
  • ఏడాదిన్నరగా ఇదే పరిస్థితి!
  • 2020 మార్చి 23 నుంచి ఇంటర్నేషనల్ విమానాలు బంద్
  • ఎయిర్ బబుల్ ఏర్పరచుకున్న దేశాల మధ్యే ప్రయాణాలు
  • కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారతీయ విమానాలపై పలు దేశాల్లో నిషేధం

అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని సెప్టెంబరు 30 వరకూ పొడిగించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. భారత్ నుంచి, అలాగే భారత్‌కు వచ్చే అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆదివారం నాడు ఒక ప్రకటన వెలువడింది. ఇలా అంతర్జాతీయ విమానాలపై భారత్‌లో నిషేధం 2020 మార్చి 23న ప్రారంభమైంది. అప్పటి నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ నిషేధాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. అంతర్జాతీయ కార్గో విమానాలకు, డీజీసీఏ ఆమోదం పొందిన విమానాల ప్రయాణాలకు మాత్రం అనుమతి ఉంటుందని తెలిపింది.

పరిస్థితిని బట్టి కొన్ని మార్గాల్లో అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతి లభించే అవకాశం కూడా ఉందని డీజీసీఏ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దైనప్పటికీ.. గత ఏడాది కాలంగా భారత ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ ద్వారా పలు అంతర్జాతీయ విమానాలు నడుపుతోంది. పలుదేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకొని, ఈ విమానాల రాకపోకలు సాగిస్తోంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ మధ్యలో భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో చాలా దేశాలు.. భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. తాజాగా పరిస్థితి కొంత అదుపులోకి రావడంతో స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, మాల్దీవులు, ఖతార్ వంటి దేశాలు భారతీయ విమానాలపై నిషేధాన్ని తొలగిస్తున్నాయి.


More Telugu News