రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తున్నా.. రేపు దీక్ష చేపడుతున్నా: మోత్కుపల్లి

  • కొన్ని రోజులుగా రేవంత్ తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది
  • దళితుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు
  • దళితుల మధ్య రేవంత్ భోజనాలు, నిద్రలు చేయగలరా?
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రేపు ఒక రోజు దీక్షకు దిగనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ దీక్షను చేపట్టనున్నట్టు నర్సింహులు చెప్పారు. కొన్ని రోజులుగా రేవంత్ తీరు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు.

దళితుల సాధికారత కోసం సభలు, సమావేశాలను నిర్వహించడం, గిరిజన ఆత్మగౌరవ దీక్షలను నిర్వహించడం వంటివి చేస్తుండటం తనకు విస్మయాన్ని కలిగిస్తోందని చెప్పారు. పుట్టుకతోనే దొరల వంశానికి చెందిన రేవంత్ రెడ్డి ఆయన స్వగ్రామంలో దళితుల మధ్య భోజనాలు, నిద్రలు చేయగలరా? అని ప్రశ్నించారు. గత 70 ఏళ్లలో ఎంత మంది దళితులు ఆయన ఇంటి ముందు చెప్పులు వేసుకొని నడిచారో రేవంత్ చెప్పగలరా? అని అడిగారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకం చాలా గొప్పదని... అలాంటి పథకానికి తూట్లు పొడిచేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మోత్కుపల్లి విమర్శించారు. దళితులను ముందు వరుసలో నిలుచోబెట్టి రాజకీయాలు చేయడం, దళితుల మీద ప్రేమను ఒలకబోస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడాన్ని తాను ఖండిస్తున్నానని అన్నారు. రేవంత్ వైఖరిని నిరసిస్తూ రేపు ఆదివారం నాడు బేగంపేటలోని తన నివాసంలో ఒకరోజు దీక్షను చేపట్టనున్నానని చెప్పారు. రేపు ఉదయం 9 గంటలకు లిబర్టీ చౌరస్తాలో అంబేద్కర్ చౌరస్తాకు నివాళి అర్పించి, ఆ తర్వాత ఇంటికి వెళ్లి దీక్షలో కూర్చుంటానని తెలిపారు.


More Telugu News