ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు తగిన పరిస్థితి లేదు: కేంద్ర విదేశాంగ శాఖ

  • ఆఫ్ఘన్ నుంచి 550 మందిని తరలించిన భారత్
  • వారిలో 260 మంది భారతీయులు
  • ఆఫ్ఘన్ లకు ఈ-వీసా ఇస్తున్నామన్న ఆరిందమ్ బాగ్చి
  • పరిణామాలు వేగంగా మారిపోతున్నాయని వెల్లడి
ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతీయుల తరలింపుపై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి వివరణ ఇచ్చారు. ఇప్పటివరకు కాబూల్, దుషాంబే నుంచి 6 విమానాల్లో 550 మందిని భారత్ తీసుకువచ్చామని వెల్లడించారు. వారిలో 260 మంది భారతీయులని తెలిపారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దృష్టి ప్రధానంగా ఆఫ్ఘన్ నుంచి భారతీయుల తరలింపు పైనే ఉందని, అయితే ఆఫ్ఘన్ ప్రజలకు సాయపడేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆఫ్ఘన్ పౌరులకు భారత ప్రభుత్వం ఈ-వీసా సదుపాయం ప్రకటించిందని తెలిపారు. ఈ-వీసా సాయంతో ఆఫ్ఘన్ పౌరులు 6 నెలల పాటు భారత్ లో ఉండే సదుపాయం ఉంది అని వివరించారు.

అటు ఆఫ్ఘన్ పరిస్థితులపైనా ఆరిందమ్ బాగ్చి అభిప్రాయాలను పంచుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటుకు తగిన పరిస్థితులు లేవని పేర్కొన్నారు. ప్రస్తుతం అనిశ్చితి రాజ్యమేలుతోందని, అక్కడి స్థితిగతులను తాము నిశితంగా పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్ లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయని బాగ్చి తెలిపారు.


More Telugu News