సాధారణ కూలీకి కరెంట్​ బిల్లు షాక్​!

  • రూ.1,48,371 బిల్లు
  • ఏపీలోని పాల్తూరులో ఘటన
  • పలుమార్లు తిరిగితే రూ.56,399కి తగ్గించిన అధికారులు
  • మరికొందరికీ అధిక బిల్లులు
అతడో సాధారణ కూలీ. రోజూ పనికెళ్తే తప్ప పూట గడవదు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ చేదోడుగా ఉంటోంది. ఇంట్లో ఓ టీవీ.. ఫ్యాన్.. మూడు కరెంట్ బల్బులు తప్ప ఇంకేమీ లేవు. అంతటి పేదోడికి పెద్ద షాకే తగిలింది. కరెంటోళ్లు ఇచ్చిన బిల్లు చూసి గుండె గుభేల్ మంది. రూ.లక్షకుపైనే బిల్లు వచ్చింది. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామానికి చెందిన పర్వతప్ప అనే వ్యక్తికి ఎదురైంది.

నెలనెలా రూ.200 నుంచి రూ.300 దాకా వచ్చే కరెంట్ బిల్లు.. ఇటీవల ఏకంగా రూ.1,48,371 వచ్చింది. ఆ బిల్లు చూసిన పర్వతప్ప కలవరపాటుకు గురయ్యాడు. విద్యుత్ సిబ్బందిని పలుమార్లు కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. బిల్లును రూ.56,399కు తగ్గించారు తప్పితే.. కారణాలు మాత్రం చెప్పలేదు. అంత బిల్లు కట్టలేమని పర్వతప్ప మొరపెట్టుకున్నా అధికారులు వినలేదు.

అతడొక్కడికే కాదు.. ఆ గ్రామంలోని మరికొందరికీ కరెంట్ బిల్లులు భారీగానే పడ్డాయి. బండయ్య అనే వ్యక్తికి ఒకసారి రూ.78,167, ఇంకోసారి రూ.16,251 బిల్లులు వచ్చాయి. దీనిపై విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి వివరణ ఇచ్చారు. సాంకేతిక సమస్యలు లేదా బిల్లు తీసేటప్పుడు జరిగిన పొరపాట్ల వల్ల ఇంత ఎక్కువ బిల్లులు వచ్చి ఉంటాయని చెప్పారు. మీటర్లలో ఏమైనా సమస్యలున్నాయేమో చూసి.. వారి బిల్లులను తగ్గిస్తామని హామీ ఇచ్చారు.


More Telugu News