కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా తాజా హెచ్చరికలు

  • నెత్తురోడిన కాబూల్ ఎయిర్ పోర్టు
  • నిన్న ఉగ్రబీభత్సం
  • జంట పేలుళ్లకు పాల్పడిన ఐసిస్
  • 103కి పెరిగిన మృతుల సంఖ్య
  • మృతుల్లో 28 మంది తాలిబన్లు
ఆఫ్ఘనిస్థాన్ లో గురువారం జరిగిన భయానక ఉగ్రదాడుల తరహాలోనే మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా తాజాగా హెచ్చరించింది. అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ జనరల్ ఫ్రాంక్ మెకెంజీ స్పందిస్తూ... ఈసారి కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద మరింత భీకర దాడులు ఉండొచ్చని వెల్లడించారు. రాకెట్లు, పేలుడు పదార్థాలు నింపిన వాహనాలతో ఎయిర్ పోర్టు లక్ష్యంగా దాడులు చేసే అవకాశాలున్నాయని మెకెంజీ వివరించారు. ఉగ్రదాడులను ఎదుర్కొనడానికి తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

కాగా, నిన్న జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 13 మంది అమెరికా మెరైన్ కమాండోలు మృతి చెందారు. ఆఫ్ఘన్ గడ్డపై ఇంతమంది అమెరికా సైనికులు మరణించడం 2011 తర్వాత  ఇదే ప్రథమం. నాడు వార్డక్ ప్రావిన్స్ లో అమెరికా సైనిక హెలికాప్టర్ ను ఉగ్రవాదులు కూల్చివేయగా 30 మంది అమెరికా సైనిక సిబ్బంది మరణించారు.

 100 దాటిన మృతుల సంఖ్య

కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఐసిస్ ఉగ్రమూకలు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో మరణించిన వారి సంఖ్య 103కి చేరింది. ఇందులో 13 మంది అమెరికా సైనికులు కాగా, మిగిలినవారు ఆఫ్ఘన్లు. మరణించిన వారిలో 28 మంది తాలిబన్లు కూడా ఉన్నారు.


More Telugu News