ఢిల్లీ చేరుకున్న ఆఫ్ఘన్ మహిళా ఎంపీని తిప్పి పంపిన అధికారులు... తప్పు చేశామన్న విదేశాంగ మంత్రి జై శంకర్!

  • ఆగస్టు 20న ఘటన
  • ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎంపీ రంగినా కర్గర్
  • ఎయిర్ పోర్టులో నిలువరించిన అధికారులు
  • అదే విమానంలో ఇస్తాంబుల్ కు పంపిన వైనం
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల రాజ్యం వచ్చిన నేపథ్యంలో సాధారణ పౌరులు, ప్రజాప్రతినిధులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని దేశం వీడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాగోలా భారత్ చేరుకున్న ఆఫ్ఘన్ మహిళా ఎంపీ రంగినా కర్గర్ ను భారత అధికారులు ఢిల్లీ నుంచి తిప్పిపంపడం వివాదాస్పదమైంది. ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో విపక్షనేతలు ఈ అంశాన్ని ప్రస్తావించగా, కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ తాము చేసింది తప్పేనని అంగీకరించారని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.

ఆగస్టు 20న ఎంపీ రంగినా కర్గర్ ను ఫ్లై దుబాయ్ విమానం ద్వారా టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను ఎయిర్ పోర్టు నుంచి బయటికి అనుమతించలేదు. రెండు గంటల పాటు ఎయిర్ పోర్టులోనే నిర్బంధించిన అనంతరం ఆమెను అదే విమానంలో దుబాయ్ మీదుగా ఇస్తాంబుల్ కు తిప్పి పంపారు. ఈ అంశం అఖిలపక్ష సమావేశంలో చర్చకు రాగా, కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ వివరణ ఇచ్చారు.

ఇది దురదృష్టకరమైన ఘటన అని, అందుకు చింతిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కానివ్వబోమని హామీ ఇచ్చారు. అవసరమైతే ఆ మహిళా ఎంపీకి అత్యవసర వీసా మంజూరు చేస్తామని కేంద్రమంత్రి వెల్లడించారని ఈ మేరకు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మీడియాకు వివరించారు. కేంద్రం తన హామీని ఎంతవరకు నిలుపుకుంటుందో చూస్తామని ఖర్గే అన్నారు.


More Telugu News